నేను మాస్క్‌ వేసుకోను.. ఏమౌతుంది?

మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా తను ఏ కార్యక్రమంలోనూ మాస్క్ ధరించనని చెప్పడం చర్చనీయాంశమైంది.

Updated : 24 Sep 2020 14:43 IST

మధ్యప్రదేశ్‌ హోం మంత్రి

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌లో కొవిడ్‌-19 కేసుల సంఖ్య నానాటికీ అధికమవుతున్నప్పటికీ ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా తను ఏ కార్యక్రమంలోనూ మాస్క్ ధరించనని చెప్పడం చర్చనీయాంశమైంది. ఆయన తీరుపై విమర్శలు చెలరేగడంతో.. ఆనారోగ్య సమస్య వల్లే  తాను మాస్క్‌ ధరించడంలేదని ఆయన వివరణ ఇచ్చారు. పేద, వెనుక బడిన వర్గాలకు సహాయాన్ని అందించే సంబాల్ యోజన పంపిణీ కార్యక్రమంలో ఆయన బుధవారం పాల్గొన్నారు.  అనంతరం పలువురి ప్రాణాలను కాపాడిన ఇండోర్‌ పోలీసు సిబ్బందికి సన్మానం చేయడంతోపాటు పలు కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన మాస్క్‌ ధరించకపోవటంపై మంత్రిని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘నేను ఏ కార్యక్రమంలోనూ మాస్క్‌ ధరించను... అయితే ఏమౌతుంది..?’’ అని ఆయన  జవాబిచ్చారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌-19 నియమాలు కేవలం సామాన్యుల కోసం మాత్రమేనా.. అని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు విమర్శనాస్త్రాలు సంధించారు.  దీంతో తాను సాధారణంగా మాస్క్‌ ధరించే ఉంటానని.. పోలిపస్‌ అనే ఆనారోగ్య సమస్య కారణంగా దానిని ఎక్కువ సేపు ధరిస్తే తనకు ఊపిరాడదని నరోత్తమ్‌ మిశ్రా వివరణ ఇచ్చారు.

కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర మంత్రులు, భాజపా నేతలు అందరూ మాస్కులు ధరించే పాల్గొనటం గమనార్హం. మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు సుమారు 20,800కు పైగా కేసులు నమోదు కాగా.. 516 మంది మరణించారు. ఇదిలా ఉండగా ఇండోర్‌ మున్సిపల్‌‌ కార్పొరేషన్‌ పరిధిలో మాస్కులు ధరించని వారికి రూ.200 జరిమానా విధించాలనే నిబంధన అమలులో ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని