రిటైర్ అవుతాను కానీ..

తమను మోసం చేసిన సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)ని ఓడించేందుకు అవసరమైతే భాజపాకు ఓటేస్తానంటూ ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌, ఎస్పీ వక్రీకరిస్తున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి మండిప్డడారు.

Published : 03 Nov 2020 01:18 IST

కమలం పార్టీతో పొత్తుపై ఊహాగానాలకు చెక్‌ పెట్టిన అధినేత్రి

దిల్లీ: తమను మోసం చేసిన సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)ని ఓడించేందుకు అవసరమైతే భాజపాకు ఓటేస్తానంటూ ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌, ఎస్పీ వక్రీకరిస్తున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి మండిప్డడారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల కోసం కలిసిన ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఏడాది తిరగకుండానే విడిపోయి మళ్లీ శత్రువులుగా మారిపోయాయి. అయితే, బీఎస్పీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌పై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమను మోసం చేసిన ఎస్పీని మండలి ఎన్నికల్లో ఓడిస్తామని, అందుకోసం అవసరమైతే భాజపా లేక ఇతర పార్టీ అభ్యర్థులకు తమ పార్టీ ఓటు వేస్తుందంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు. 

‘అక్టోబర్ 29న నేను చేసిన ప్రకటనను కాంగ్రెస్, ఎస్పీ వక్రీకరిస్తున్నాయి. బీఎస్పీ, భాజపాతో పొత్తు పెట్టుకుంటుందని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఎస్పీని ఓడించి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఆ మాట అన్నాను. భాజపా అభ్యర్థి అయినా, ఇతర బలమైన అభ్యర్థి పోటీ చేసినా ఎస్పీని ఓడించేందుకు ఓటు వేస్తానని చెప్పాను. కానీ ఆ పార్టీలు మాత్రం  ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు కుట్ర చేస్తున్నాయి. రాజకీయాల నుంచి రిటైర్‌ అయినా అవుతాను కానీ, భాజపాతో మాత్రం పొత్తు పెట్టుకోను. నేను నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు  సమాజంలో ఎలాంటి ఘర్షణలు జరగలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా భాజపా నాపై ఒత్తిడి తేవాలని ప్రయత్నించింది. కానీ, నేను మాత్రం తలొంచలేదు’ అంటూ ఊహాగానాలకు సూటిగా సమాధానమిచ్చారు. అలాగే భాజపా, బీఎస్పీ సిద్ధాంతాలు పూర్తిగా వేరని స్పష్టం చేశారు. 2003లో కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తనను తప్పుడు కేసులో ఇరికించి ఒత్తిడి తేవాలని ప్రయత్నించిందన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ తనకు మద్దతు తెలిపారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుందన్నారన్నారు. కానీ, ఆ తరవాత కాంగ్రెస్‌ పదేళ్లు అధికారంలో ఉన్నా..చేసిందేమీ లేదని మాయావతి విమర్శించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు