‘కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని’

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ప్రకటించామని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. కానీ, సీఎం అశోక్‌ గహ్లోత్‌ బీఎస్పీ గుర్తుపై గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేల్ని తమ పార్టీలో.........

Published : 29 Jul 2020 00:58 IST

రాజస్థాన్‌ సంక్షోభంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి

జైపుర్‌: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ప్రకటించామని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. కానీ, సీఎం అశోక్‌ గహ్లోత్‌ బీఎస్పీ గుర్తుపై గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేల్ని వారి పార్టీలో విలీనం చేసుకొని మోసం చేశారని ఆరోపించారు. గతంలో ఆయన అధికారంలో ఉన్న సమయంలోనూ ఇదే తరహాలో వ్యవహరించారన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగిన ఈ విలీనంపై గతంలోనే కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పటికీ.. కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో వేచిచూశామన్నారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేదని లేదని.. అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళతామని తేల్చి చెప్పారు. 

రాజస్థాన్‌లో బీఎస్పీ గుర్తుపై గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేల్ని బలపరీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్‌ జారీ చేశామని మాయావతి తెలిపారు. ఒకవేళ విప్‌ను ధిక్కరించినట్లైతే వారి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనాన్ని సవాల్‌ చేస్తూ భాజపా ఎమ్మెల్యే మదన్‌ దిల్వార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. నేడు మరోసారి ఇదే విషయంపై కొత్తగా పిటిషన్‌ వేశారు.

ప్రారంభమైన కేబినెట్‌ భేటీ..

మరోవైపు సీఎం అశోక్‌ గహ్లోత్‌ నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్‌ భేటీ అయింది. గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా రెండోసారి కూడా అసెంబ్లీ నిర్వహణ ప్రతిపాదనల్ని తిప్పి పంపడంతో తదుపరి అనుసరించాల్సిన వ్యుహాలపై చర్చిస్తోంది. ఎలాగైనా శాసనసభను సమావేశపరిచి బలనిరూపణ చేసుకోవాలని సీఎం పట్టుదలతో ఉన్నారు. కానీ, ఇప్పటికీ రెండు సార్లు గవర్నర్‌ నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. తొలుత ఆరు అంశాలపై వివరణ కోరిన గవర్నర్‌.. రెండోసారి అదనపు సమాచారం కావాలని కోరుతూ కేబినెట్‌ సిఫార్సులని వెనక్కి పంపారు. విశ్వాస పరీక్షకు వెళ్లాలనే ఉద్దేశముంటే దాన్ని ప్రస్తావిస్తూ తిరిగి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజస్థాన్‌లో గవర్నర్‌ పాత్రపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార భాజపా గవర్నర్‌ వ్యవస్థని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం ఆరోపించారు. భాజపా నియమించిన గవర్నర్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నడుచుకుంటున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని