భాజపాకు ఓటేసి.. అఖిలేశ్‌ని ఓడిస్తా: మాయావతి

అధికారం కోసం వైరాన్ని మరిచి చేతులు కలిపిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) మిత్రబంధం ఎంతో కాలం నిలవలేదు. సార్వత్రిక ఎన్నికల కోసం కలిసిన ఈ రెండు పార్టీలు సంవత్సరం తిరగకుండానే విడిపోయి మళ్లీ పాత శత్రుత్వాన్ని

Published : 30 Oct 2020 01:16 IST

దిల్లీ: అధికారం కోసం వైరాన్ని మరిచి చేతులు కలిపిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) మిత్రబంధం ఎంతో కాలం నిలవలేదు. సార్వత్రిక ఎన్నికల కోసం కలిసిన ఈ రెండు పార్టీలు ఏడాది తిరగకుండానే విడిపోయి మళ్లీ పాత శత్రుత్వాన్ని కొనసాగిస్తున్నాయి. తాజాగా బీఎస్పీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో బీఎస్పీ అధినేత్రి మాయావతి.. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌‌ యాదవ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమను మోసం చేసిన సమాజ్‌ వాదీ పార్టీని రానున్న మండలి, రాజ్యసభ ఎన్నికల్లో దారుణంగా ఓడిస్తామని, ఇందుకోసం అవసరమైతే భాజపా లేదా ఇతర పార్టీ అభ్యర్థులకు తమ పార్టీ ఓటేస్తుందని బహిరంగంగా వ్యాఖ్యానించారు.  

త్వరలో ఉత్తరప్రదేశ్‌లో 10 రాజ్యసభ సీట్లకు ఎన్నికలకు జరగనున్నాయి. ఇందులో ఒక స్థానానికి ఎస్పీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. అయితే సంఖ్యా బలం లేనప్పటికీ మాయావతి పార్టీ కూడా ఒక స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. భాజపాయేతర పార్టీల మద్దతుతో రాజ్యసభ ఎన్నికల్లో గెలవాలని బీఎస్పీ భావించింది. అయితే మాయావతికి షాక్‌ ఇస్తూ నలుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. బీఎస్పీ ప్రతిపాదించిన అభ్యర్థి రామ్‌జీ గౌతమ్‌ నామినేషన్‌ పత్రాలపై తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఎన్నికల అధికారులు రామ్‌జీ గౌతమ్‌ నామినేషన్‌ను అంగీకరించారు. 

కాగా.. తిరుగుబాటు చేసిన బీఎస్పీ ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీతో సంప్రదింపులు జరిపినట్లు తాజాగా బయటకొచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన మాయావతి.. ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీతో చేతులు కలపడం తాను చేసిన పెద్ద పొరపాటు అని అన్నారు.  ‘మతపరమైన శక్తులను ఓడించేందుకు లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు పెట్టుకున్నాం. అయితే ఆ పార్టీ కుటుంబ విభేదాల కారణంగా ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది. పొత్తు పెట్టుకున్న మొదటి రోజు నుంచి ఆ పార్టీపై నేను 1995లో పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని బలవంతపెట్టారు. దీంతో నేను కేసు వెనక్కి తీసుకున్నా. అదే నేను చేసిన పొరపాటు. ఫలితాల తర్వాత ఎస్పీ తీరు మారింది. మాతో సరిగా ఉండలేదు. అందుకే విడిపోయాం’ అని మాయావతి విలేకరుల సమావేశంలో తెలిపారు. 

ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో తాము గెలవకుండా ఉండేందుకు బీఎస్పీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారని మాయావతి ఆరోపించారు. దీనికి తాము సరైన గుణపాఠం చెబుతామన్నారు. అవసరమైతే సమాజ్‌వాదీ పార్టీని ఓడించేందుకు భాజపా లేదా ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులకు తమ పార్టీ ఎమ్మెల్యేలు ఓటేస్తారని స్పష్టం చేశారు. అటు బీఎస్పీ అభ్యర్థి రామ్‌జీ నామినేషన్‌ను వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలను మాయావతి పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని