Akhilesh Yadav: యూపీలో రసవత్తర పోరు.. అఖిలేశ్‌ పోటీ ఇక్కడి నుంచే

కర్హాల్‌లో సమాజ్‌వాదీ పార్టీ, అఖిలేశ్‌ కుటుంబానికి మంచి పట్టు ఉంది. 1993 నుంచి ఈ స్థానంలో ఎస్పీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు.

Published : 21 Jan 2022 01:49 IST

లఖ్‌నవూ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మొన్నటివరకు ఎన్నికల్లో పాల్గొనటం లేదని చెప్పిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌.. మనసు మార్చుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన మెయిన్‌పురిలోని కర్హాల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది.

కర్హాల్‌లో సమాజ్‌వాదీ పార్టీ, అఖిలేశ్‌ కుటుంబానికి మంచి పట్టు ఉంది. 1993 నుంచి ఈ స్థానంలో ఎస్పీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. ఒక్క 2002-07లో మాత్రం భాజపా గెలుపొందింది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సోబరన్‌ సింగ్ యాదవ్‌ ఇక్కడ లక్షకుపైగా ఓట్లతో ఘన విజయం అందుకున్నారు. ఈ స్థానంలో భాజపా నుంచి పోటీ చేసిన రమా శక్యాకు 65వేల ఓట్లు వచ్చాయి. ఇక, మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గానికి అఖిలేశ్‌ తండ్రి, సమాజ్‌వాదీ వ్యవస్థాపకుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఈ స్థానం నుంచైతే గెలుపు ఖాయమని అఖిలేశ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అఖిలేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి. ప్రస్తుతం అఖిలేశ్‌ యాదవ్ అజంగఢ్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. గతంలో యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ.. శాసన మండలి నుంచి ప్రాతినిధ్యం వహించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చే ఎన్ని్కల్లో పోటీ చేస్తుండటం.. అఖిలేశ్‌పై ఒత్తిడి పెంచినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని