UP Election 2022:భాజపాలో చేరడానికి కారణాలివే.. స్పందించిన ములాయం కోడలు

సమాజ్‌ వాదీ పార్టీ నుంచి అపర్ణ యదవ్‌ బయటకు రావడానికి ఇవే కారణాలంటూ వస్తున్న పలు పుకార్లను ఆమె ఖండించారు. భాజపాలో చేరడానికి కారణాలు వెల్లడించారు......

Published : 26 Jan 2022 01:59 IST

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీకి షాకిస్తూ.. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ కోడలు అపర్ణ యాదవ్‌ భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే సొంత పార్టీని వీడేందుకు ఇవే కారణాలంటూ పలు అంశాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. టికెట్‌ ఇచ్చేందుకు సమాజ్‌ వాదీ పార్టీ నిరాకరించిందని, అందుకే ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చారని వార్తలు చక్కర్లు కొట్టాయి. కాగా ఆ వార్తలను అపర్ణ యదవ్‌ ఖండించారు. తాను భాజపాలో చేరడానికి గల కారణాలను తాజాగా వెల్లడించారు.

జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘టికెట్‌ కోసమే నేను భాజపాలోకి వచ్చానని కొందరు మాట్లాడుతున్నారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. సమాజ్‌ వాదీ పార్టీ నాకు టికెట్‌ నిరాకరించలేదు. జాతీయ వాదం కోసమే భాజపాలో చేరాను. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విధానాలతో నేను ప్రభావితమయ్యాను’ అని పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసేందుకు చేరలేదని, భాజపా తరఫున ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు.

అపర్ణ భాజపాలో చేరికపై ములాయం సింగ్ కుమారుడు ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ తనదైన రీతిలో స్పందించారు. తమ పార్టీ సిద్ధాంతాలను ఆమె భాజపాలోకి తీసుకెళ్తారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేని వారికి భాజపా టికెట్లు ఇస్తుందని, ఇందుకు ఆ పార్టీకి కృతజ్ఞతలంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అలాగే ఆమె పార్టీ వీడకుండా నేతాజీ (ములాయం సింగ్) ఒప్పించే ప్రయత్నం చేశారని కూడా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని