UP Elections: యూపీ పరిస్థితి ‘సగం ఆదాయం.. రెట్టింపు ద్రవ్యోల్బణం’గా ఉంది: అఖిలేశ్‌ యాదవ్‌

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి ‘సగం ఆదాయం.. రెట్టింపు ద్రవ్యోల్బణం’గా ఉందని సమాజ్‌వాది పార్టీ(ఎస్పీ) అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ అన్నారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి ప్రజలు కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బుధవారం గణతంత్ర దినోత్సవం

Published : 27 Jan 2022 15:07 IST

లఖ్‌నవూ: ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి ‘సగం ఆదాయం.. రెట్టింపు ద్రవ్యోల్బణం’గా ఉందని సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి ప్రజలు కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బుధవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వివిధ అంశాలను ప్రస్తావిస్తూ.. భాజపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ‘సగం ఆదాయం.. రెట్టింపు ద్రవ్యోల్బణం’తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ ప్రభుత్వం సమాజాన్ని రెండు భాగాలుగా విభజించింది. కొంత మంది ప్రజలు క్రమంగా ధనవంతులవుతుంటే.. మరికొందరు నానాటికీ పేదరికంలోకి జారుకొంటున్నారు. మధ్యతరగతి ప్రజలు ఈ అసమానతల మధ్య నలిగిపోతున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి అన్నీ కష్టాలు.. ఇబ్బందులే. చివరికి సామాన్య ప్రజలు తమ భవిష్యత్తు కోసం బ్యాంకుల్లో దాచుకునే డబ్బుకు కూడా రక్షణ లేకుండాపోయింది’’అని భాజపా పాలనపై అఖిలేశ్‌ విమర్శలు చేశారు. రాష్ట్రంలో సానుకూల మార్పులు, అభివృద్ధి జరగాలంటే.. కొత్త ఉత్తరప్రదేశ్‌ను చూడాలనుకుంటే తమ పార్టీని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.

తాము ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని అఖిలేశ్‌ ప్రతిజ్ఞ చేశారు. ‘‘ప్రతి ఇంటికి 300యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఉచిత సాగు నీటి సరఫరా, అన్ని రంగాల పంటలకు కనీస మద్దతు ధర, వడ్డీ లేని రుణాలు, బీమా, పింఛన్‌, ఏడాదికి రూ.18వేల ఎస్పీ పింఛన్‌, ప్రతిభ ఉన్న విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ, ఐటీ రంగంలో కొత్తగా 22లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వఉద్యోగాల భర్తీ, కుల గణన వంటి హామీలన్నీ మేం అధికారంలోకి వచ్చాక నెరవేరుస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నా’’అంటూ అఖిలేశ్‌ తను రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

వచ్చే నెలలో ఉత్తరప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏడు దశల్లో నిర్వహించబోతున్న ఈ ఎన్నికల ఫలితాలను మార్చి 10న వెల్లడిస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. రాజకీయ పార్టీలన్నీ తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కూటములుగా ఏర్పడుతూ, ఇతర పార్టీలపై విమర్శలు చేస్తూ, హామీల వర్షం కురిపిస్తూ ప్రజలను ఆకర్షించేందుకు యత్నిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని