నన్‌లపై దాడి.. సీఎం అబద్ధం చెప్పారు:పీయూష్‌ 

యూపీలోని ఝాన్సీలో రైలులో క్రైస్తవ సన్యాసినులపై దాడి జరిగిందంటూ కేరళ సీఎం పినరయి విజయన్‌ అవాస్తవం చెప్పారని, అవన్నీ నిరాధార ఆరోపణలేనని కేంద్రమంత్రి....

Updated : 29 Mar 2021 16:58 IST

ఆరోపణలు నిరాధారమైనవన్న కేంద్రమంత్రి

కొచ్చి: యూపీలోని ఝాన్సీలో రైలులో క్రైస్తవ సన్యాసినులపై దాడి జరిగిందంటూ కేరళ సీఎం పినరయి విజయన్‌ అవాస్తవం చెప్పారని, అవన్నీ నిరాధార ఆరోపణలేనని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. సోమవారం ఆయన కొచ్చిలో మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందగానే యూపీ పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేశారన్నారు. ప్రయాణీకుల నుంచి ధ్రువీకరణపత్రాలను పరిశీలించిన తర్వాత తమకు అందిన ఫిర్యాదు నిరాధారమైనదిగా నిర్ధారించుకొని విడిచిపెట్టారన్నారు. ఏబీవీపీ కార్యకర్తలు సన్యాసినులపై దాడికి పాల్పడ్డారంటూ వచ్చిన వార్తలపై ఆయన పైవిధంగా స్పందించారు.  ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కోరుతూ భాజపా రాష్ట్ర శాఖ, మరికొందరు యూపీ ప్రభుత్వాన్ని కోరారని గుర్తు చేశారు. 

కేరళ సీఎం పినరయి విజయన్‌ మైనార్టీలను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నిస్తూ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని పీయూష్‌ గోయల్‌ ఆరోపించారు.

యూపీలో ఇటీవల కొందరు క్రైస్తవ సన్యాసినులు వేధింపులకు గురయ్యారనే ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. ఈ నెల 19న నన్‌లు ఇద్దరు మహిళలను బలవంతపు మత మార్పిడికి తమ వెంట తీసుకెళ్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏబీవీపీ  కార్యకర్తలు వారిని రైలు నుంచి బలవంతంగా కిందికి దించివేసినట్టు ఆరోపణలు వచ్చాయి.  పోలీసులు కూడా తొలుత క్రైస్తవ సన్యాసినులను అదుపులోకి తీసుకున్నారు. పరిశీలన తర్వాత  వారిని విడిచిపెట్టారు. అనంతరం సన్యాసినులు వేరే రైలులో ఒడిశాకు వెళ్లిపోయారు.  ఈ ఘటనను కేరళ సీఎం విజయన్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని