Amarinder Singh: ‘అందుకే ఎన్ని అవమానాలకు గురిచేసినా భరించా’

ఏదో ఒత్తిడిలో ఉన్న కారణంగానే ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్‌ అమరీందర్‌ రాజీనామా చేశారన్న పంజాబ్‌ కాంగ్రెస్ ఇంఛార్జి హరీశ్‌ రావత్‌ వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి మండిపడ్డారు.....

Updated : 02 Oct 2021 10:56 IST

దిల్లీ: ఏదో ఒత్తిడిలో ఉన్న కారణంగానే ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్‌ అమరీందర్‌ రాజీనామా చేశారన్న పంజాబ్‌ కాంగ్రెస్ ఇంఛార్జి హరీశ్‌ రావత్‌ వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను అమరీందర్‌సింగ్‌ ఎద్దేవా చేస్తూ.. ఒత్తిడి కారణంగానే రాజీనామా చేశానని, కానీ తనపై ఉన్న ఏకైన ఒత్తిడి కాంగ్రెస్‌పై తనకున్న విధేయత అని పేర్కొన్నారు. అందువల్లే ఇన్నిరోజులు ఎవరు ఎన్ని అవమానాలకు గురిచేసినా భరించానని తెలిపారు. రావత్‌ వాదనలు, ఆరోపణలు దారుణంగా ఉన్నాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

పంజాబ్‌ ముఖ్యమంత్రిగా అమరీందర్‌సింగ్‌ రాజీనామా చేసిన మరుసటి రోజే హరీశ్‌ రావత్‌ స్పందించారు. ఆయనను ఎవరూ అవమానించలేదని, మొండితనంగా ప్రవర్తిస్తూ ఎమ్మెల్యేల మద్దతును ఆయన ఎలా కోల్పోయారో వివరంగా తెలియజేస్తూ ఓ ప్రకటన జారీ చేశారు. దీనిపైనా అమరీందర్‌ స్పందింస్తూ.. హరీశ్‌ రావత్‌ వ్యాఖ్యలే ప్రస్తుతం కాంగ్రెస్‌ ఉన్న దీన పరిస్థితిని వివరిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అంత పట్టు ఉంటే తాను సీఎంగా ఉన్న సమయంలో సిద్ధూ నేతృత్వంలోని రెబల్‌ అభ్యర్థులు సొంత పార్టీపైనే ఎలా విమర్శలు చేయగలిగారో చెప్పాలని కోరారు.

సీఎల్పీ సమావేశానికి ముందురోజే కాంగ్రెస్‌ ఇంఛార్జి తనతో మాట్లాడినట్లు కెప్టెన్‌ తెలిపారు. ‘సీఎల్పీ మీటింగ్‌కు ముందురోజే రావత్‌ నాతో మాట్లాడారు. 43 ఎమ్మెల్యేలు ఓ లేఖ రాసినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన అబద్ధాలు ఆడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది’ అని పేర్కొన్నారు. ‘సీఎం పదవి నుంచి వైదొలిగే మూడు వారాల ముందే నా రాజీనామా విషయాన్ని సోనియా గాంధీకి తెలియజేశాను. పదవిలో కొనసాగాలని ఆమె కోరారు. కానీ నాకు జరిగిన అవమానాలను ప్రపంచం చూసింది. రావత్‌ ఆరోపణలు బాధాకరం’ అని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత అమరీందర్‌ సింగ్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఆయన భాజపాలో చేరుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన మాజీ సీఎం తాను భాజపాలో చేరడం లేదని వెల్లడించారు. అలాగని కాంగ్రెస్‌లోనూ కొనసాగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే ఆయన కొత్త పార్టీని స్థాపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోది. వచ్చే 15 రోజుల్లో నూతన రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశాలున్నాయని అమరీందర్‌సింగ్‌ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ విషయమై ఇప్పటికే తన మద్దతుదారులతో విస్తృతంగా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు