Punjab politics: సీఎం పదవికి కెప్టెన్‌ అమరీందర్‌ రాజీనామా

Punjab congress: పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తన సీఎం పదవికి రాజీనామా చేశారు.

Updated : 18 Sep 2021 17:31 IST

చండీగఢ్‌: పంజాబ్‌లో రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ కురువృద్ధుడు, కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తన సతీమణితో కలిసి రాజ్‌భవన్‌కు చేరుకున్న కెప్టెన్‌.. గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. పంజాబ్‌ కాంగ్రెస్‌ శాసనసభాపక్షం భేటీకి కొన్ని నిమిషాల ముందు రాజీనామా చేశారు. సీఎల్పీ భేటీ మరోసారి నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించడం తనను మనస్తాపానికి గురిచేసినట్లు అమరీందర్‌ పేర్కొన్నారు. అందుకే పదవి నుంచి తప్పుకోవాలని ఈ ఉదయమే నిర్ణయం తీసుకున్నట్లు రాజీనామా అనంతరం కెప్టెన్‌ మీడియాకు వెల్లడించారు. తన మద్దతుదారులతో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని కెప్టెన్‌ వ్యాఖ్యానించారు. కొత్త సీఎం ఎవరో తనకు తెలీదని చెప్పారు. 

మరోవైపు కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్‌ శాసనసభాపక్షం సమావేశం అవుతోంది. సీఎల్పీ భేటీ నిర్వహించాలని శుక్రవారం అర్ధరాత్రే పార్టీ నిర్ణయించింది. ఆ మేరకు పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చింది. మెజార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని మార్చాలని ఒత్తిడి చేసిన నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ భేటీలో అమరీందర్‌ వారసుడిని ఎన్నుకోనున్నారు. ఈ భేటీకి పీసీసీ అధ్యక్షుడు సిద్ధూతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి హరీశ్‌ రావత్‌ కూడా హాజరుకానున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని