ఆస్పత్రి నుంచి దీదీ డిశ్చార్జ్‌

కాలి గాయంతో ఆసుపత్రిలో చేరిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. మరో 48 గంటలపాటు.....

Published : 12 Mar 2021 19:21 IST

కోల్‌కతా: కాలి గాయంతో ఆసుపత్రిలో చేరిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. మరో 48 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సినప్పటికీ.. ఆమె అభ్యర్థన మేరకు ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు వైద్యులు తెలిపారు. రెండు రోజుల పాటు చికిత్స తీసుకున్న మమత ఆస్పత్రి నుంచి వీల్‌చైర్‌లో బయటకొచ్చారు. అక్కడున్న వారి సాయంతో కారెక్కి తన నివాసానికి బయల్దేరారు. మరోవైపు మమతా బెనర్జీపై ‘దాడి’కి నిరసనగా శుక్రవారం టీఎంసీ కార్యకర్తలు నిశ్శబ్ద మార్చ్‌ చేపట్టారు. 

సీఈసీకి టీఎంసీ ఫిర్యాదు

మమతా బెనర్జీపై కుట్రపూరితంగానే దాడి జరిగిందని ఆరోపిస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌.. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దిల్లీలోని కేంద్ర ఎన్నికల అధికారి సునీల్‌ అరోడాను కలిసిన పార్టీ బృందం.. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేసింది. ఇందుకు సంబంధించి కొన్ని మెమోలు కూడా సమర్పించింది. గతంలో సోషల్‌మీడియా వేదికగా భాజపా నేతలు ముఖ్యమంత్రిపై బెదిరింపులకు పాల్పడ్డారని టీఎంసీ ఆరోపించింది. 

ఆదివారం మేనిఫెస్టో ప్రకటన..

దీదీ ఆసుపత్రిలో చేరడంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం.. గురువారం కాళీఘాట్‌లోని తన నివాసం నుంచి సీఎం.. మేనిఫెస్టో ప్రకటించాల్సి ఉంది. అయితే ఘటన నేపథ్యంలో దాన్ని కొద్దిరోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. మార్చి 14 ఆదివారం రోజున మేనిఫెస్టోను ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని