రాత్రి కర్ఫ్యూ కంటితుడుపు చర్య: భట్టి

కొవిడ్‌ తీవ్రత నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిష్ఫ్రయోజనకరమైన చర్య అని

Updated : 21 Apr 2021 04:04 IST

హైదరాబాద్‌: కొవిడ్‌ తీవ్రత నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిష్ఫ్రయోజనకరమైన చర్య అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో భట్టి ఓ ప్రకటన విడుదల చేశారు. జన సంచారం స్వల్పంగా ఉండే రాత్రి సమయంలో కర్ఫ్యూ పెట్టడంలో ఔచిత్యం ఏమిటో.. ఈ విధమైన చర్యలు కరోనా వ్యాప్తిని ఏ విధంగా నిలువరిస్తాయో అర్థం కావడం లేదన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఉందని భట్టి విమర్శించారు. 

కరోనా విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలంటూ అసెంబ్లీ సమావేశాల్లోనే తాము చెప్పామని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. ఆ విషయాన్ని పెడచెవిన పెట్టడంతో పాటు పబ్‌లు, మద్యం దుకాణాలు, మాల్స్‌, సినిమా హాళ్ల విషయంలో నిమ్మకుండిపోయిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అందరి సలహాలు, సూచనలతో కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవాలని.. రాత్రి కాకుండా పగటి పూట కర్ఫ్యూ విధించాలని కోరారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని భట్టి విజ్ఞప్తి చేశారు. కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని