Published : 29/10/2021 02:11 IST

Prashant Kishor: భాజపా ఎటూ వెళ్లిపోదు.. రాహుల్‌కే అది అర్థంకావట్లేదు: పీకే

పనాజీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు కాంగ్రెస్‌తో సంబంధాలు పూర్తిగా చెడినట్లేనా..?ప్రస్తుత పరిణామలు చూస్తుంటే అలాగే కన్పిస్తోంది. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ తీరుపై అసంతృప్తి వెళ్లగక్కిన పీకే.. తాజాగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీపై మరోసారి విమర్శలు గుప్పించారు. దేశ రాజకీయాల నుంచి భాజపా ఇప్పుడప్పుడే దూరంగా వెళ్లిపోదని, ఆ విషయం రాహుల్‌కే ఇంకా అర్థమవ్వట్లేదంటూ ఎద్దేవా చేశారు. 

ఇటీవల గోవాలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్‌ కిశోర్‌ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. అందులో పీకే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘భాజపా గెలిచినా.. ఓడినా భారత రాజకీయాలకు కేంద్రంగా ఉంటుంది. కాంగ్రెస్‌ తొలి 40ఏళ్లలో పరిస్థితులు ఎలా ఉండేవో ఇప్పుడూ రాజకీయాలు అలాగే ఉన్నాయి. భాజపా ఎక్కడికీ వెళ్లదు. ఒకసారి జాతీయ స్థాయిలో 30శాతం ఓట్లు సాధిస్తే.. అంత త్వరగా ఆ పార్టీ ప్రజలకు దూరమవదు. అందువల్ల.. ‘ప్రజలు కోపంగా ఉన్నారు.. మోదీని పంపిస్తారు’ అనే ట్రాప్‌లో పడకండి. ఒకవేళ మోదీని పంపిచొచ్చు. కానీ భాజపా మాత్రం వెళ్లదు. మరికొన్ని దశాబ్దాల పాటు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటుంది. మీరు పోరాడాల్సిందే. అయితే ఇక్కడ సమస్యంతా రాహుల్‌ గాంధీతోనే. బహుశా ఆయన.. మోదీని ప్రజలు పంపించే సమయం వచ్చిందని అనుకుంటున్నాడేమో. అది జరగదు..! ప్రధాని మోదీ బలాన్ని మీరు(కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) అర్థం చేసుకోకుండా, అంచనా వేయకుండా ఉంటే మీరు ఆయన్ను ఓడించలేరు’’ అని పీకే వ్యాఖ్యలు చేశారు.

ఈ వీడియోను భాజపా అధికార ప్రతినిధి అజయ్‌ షెరావత్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. కాగా.. ఇటీవల కాంగ్రెస్‌పై అసంతృప్తి వెళ్లగక్కుతూ పీకే చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ‘లఖింపుర్ ఘటన నేపథ్యంలో గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ నేతృత్వంలోని విపక్షాల ఆకస్మిక పునరుజ్జీవనం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. కానీ ఆ విషయంలో వారు నిరాశకు గురవుతున్నారు. దురదృష్టవశాత్తూ జీఓపీలో లోతుగా పాతుకుపోయిన సమస్యలు, నిర్మాణాత్మక బలహీనత వల్ల వెంటనే పరిష్కారాలు కనిపించడం లేదు’ అని ఆయన ట్వీట్ చేశారు. తాజాగా మరోసారి ఆయన రాహుల్‌పై విమర్శలు చేయడంతో పీకేకు కాంగ్రెస్‌తో పూర్తిగా చెడిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

నిజానికి పీకే.. కాంగ్రెస్‌లో చేరుతారంటూ ఈ ఏడాది జులైలో వార్తలు వినిపించాయి.  గాంధీ కుటుంబ సభ్యులతో ఆయన సమావేశం కావడం అందుకు కారణమైంది. పలు రాష్ట్రాల ఎన్నికల్లో డీఎంకే, టీఎంసీ వంటి పార్టీలను గెలిపించడంలో కీలకంగా వ్యవహరించిన ఆయనకు కాంగ్రెస్‌లో కీలక పదవి దక్కుతుందనే వార్తలు వచ్చాయి. అయితే అంతర్గతంగా పార్టీ నేతల నుంచి ఎదురైన వ్యతిరేకత కారణంగా అది సాధ్యం కాలేదని తెలుస్తోంది.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని