Punjab Polls: పంజాబ్‌లో గెలుపే లక్ష్యం.. ఆ 2 పార్టీలతో సర్దుబాటు: కెప్టెన్‌

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలే సమయం ఉండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికారం నిలబెట్టుకొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తుండగా.. ఈసారి అక్కడ పాగా వేయాలని ఆప్‌.....

Published : 07 Dec 2021 02:09 IST

చండీగఢ్‌: మరికొన్ని నెలల్లో జరగనున్న పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే తమ లక్ష్యమని మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ అన్నారు. తామే గెలుస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌తో కలిసి నడిచిన ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం  ‘పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీ’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, సోమవారం ఆ పార్టీ కార్యాలయాన్ని చండీగఢ్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వచ్చే ఎన్నికల్లో పొత్తులు, సీట్ల పంపకాలు, కూటమిలో సీఎం అభ్యర్థిత్వం తదితర అంశాలపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 

ఆ రెండు పార్టీలతోనే సర్దుబాటు.. త్వరలో ప్రకటిస్తాం!

‘‘పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీ భాజపాతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అలాగే, శిరోమణి అకాలీదళ్‌ మాజీ నేత సుఖ్‌దేవ్‌ సింగ్‌ దిండ్సా పార్టీతోనూ కలిసి పనిచేస్తాం. ఈ విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తాం. సీట్ల పంపకం అంశంపై స్పందించలేను. మా మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాలు, సర్దుబాటు జరుగుతుంది. అయితే, ఎవరికెన్ని సీట్లు అనేది చెప్పలేను. మాది సూత్రప్రాయమైన పొత్తు. సీఎం అభ్యర్థి ఎవరో కూటమిలో భాగస్వామ్యమైన పార్టీలు కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటాయి. ఎన్నికలకు ముందు సమయం ఏమీ పెద్ద సమస్య కాదు. 1980లో లోక్‌సభ ఎన్నికలకు కేవలం 14 రోజుల ముందే నన్ను అభ్యర్థిగా ప్రకటించారు. అప్పుడు లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచాను. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే మా లక్ష్యం. గెలుస్తామనే విశ్వాసం ఉంది. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులనే బరిలో దించి వారి గెలుపుకోసం పనిచేద్దామని కూటమి పార్టీలను కోరతా’’ అన్నారు. పది రోజులక్రితమే తమ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైందన్నారు. మరోవైపు, అమరీందర్‌ సింగ్‌ ఈరోజు దిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సీట్ల సర్దుబాటు, పొత్తుల అంశంపై భాజపా అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డాలతో కలిసి చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

మరోవైపు, పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలే సమయం ఉండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికారం నిలబెట్టుకొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తుండగా.. ఈసారి అక్కడ పాగా వేయాలని ఆప్‌ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఈ నేపథ్యంలో అమరీందర్‌ సింగ్‌ పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించి.. భాజపా, దిండ్సా పార్టీలతో కలిసి ఎన్నికల బరిలోకి దూకేందుకు సన్నాహాలు చేయడం.. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై జోరుగా పావులు కదుపుతుండటంతో అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

Read latest Political News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని