Regional Parties: ప్రాంతీయ పార్టీలు పెరగడానికి కాంగ్రెస్సే కారణం - జేపీ నడ్డా

యావత్‌ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీ కాదని.. అన్నా-చెల్లల పార్టీగా మారిపోయిందని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు.

Published : 20 May 2022 01:47 IST

కాంగ్రెస్‌ని అన్నా-చెల్లెల పార్టీగా అభివర్ణించిన భాజపా అధ్యక్షుడు

దిల్లీ: యావత్‌ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీ కాదని.. అన్నా-చెల్లెల పార్టీగా మారిపోయిందని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. వారసత్వ పార్టీలపై మండిపడ్డ ఆయన.. ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా లేదని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య పాలనకు కుటుంబ పార్టీల ముప్పు అనే అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్‌లో పాల్గొన్న జేపీ నడ్డా.. సిద్ధాంతాలు లేకపోవడం, ఒకే వ్యక్తి ఆసక్తికి అనుగుణంగా పార్టీ నడవడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని పేర్కొన్నారు. ఇక దేశంలో ప్రాంతీయ పార్టీలు విపరీతంగా పుట్టుకురావడానికి కాంగ్రెస్‌ పార్టీనే కారణమని జేపీ నడ్డా ఆరోపించారు.

‘పుట్టుక ఆధారంగా ఎటువంటి వివక్షనైనా రాజ్యాంగం నిషేధించింది. అయినప్పటికీ ఈ పార్టీల్లో నాయకత్వం మాత్రం జననం ఆధారంగానే నిర్ణయించబడుతుంది. ఈ క్రమంలో ఇతరులు విస్మరణకు గురౌతారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల విషయానికొస్తే ప్రతి రాష్ట్రంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలోనూ ఇదే తీరు’ అని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ఇలా కాంగ్రెస్‌ పార్టీ వల్లే దేశంలో ప్రాంతీయ పార్టీలు వృద్ధి చెందాయని ఆరోపించిన ఆయన.. జాతీయ రాజకీయాలపై ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో ప్రాంతీయ ఆకాంక్షలకు చోటు కల్పించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు.

ఈ విషయంలో భాజపా మాత్రం ప్రాంతీయ ఆకాంక్షలకు చోటు కల్పిస్తూనే జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటుందని జేపీ నడ్డా పేర్కొన్నారు. ఇక ప్రాంతీయ పార్టీలు పెరిగే కొద్దీ సిద్ధాంతాలు, ప్రాంతీయ ఆకాంక్షలను పక్కనబెట్టి వ్యక్తుల ఆరాధన పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ చివరకు జాతీయ లేదా ప్రజాస్వామ్య పార్టీగా నిలువలేకపోవడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ కేవలం అన్నా-చెల్లెల పార్టీగా మారిందన్న ఆయన.. అందులో రాహుల్‌, ప్రియాంక గాంధీలకు పెరిగిన ప్రాధాన్యాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. కేవలం ఒక్క భాజపా మాత్రమే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కొనసాగిస్తోందని జేపీ నడ్డా చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని