CoronaVaccine ధర ఒకేలా ఉండాలి 

కొవిషీల్డ్‌ టీకాకు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఇండియా మూడు రకాలుగా ధరలు నిర్ణయించడంపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి....

Published : 24 Apr 2021 01:10 IST

లఖ్‌నవూ: కొవిషీల్డ్‌ టీకాకు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఇండియా మూడు రకాలుగా ధరలు నిర్ణయించడంపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ అంశంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. కరోనా వ్యాక్సిన్‌ ధరల్లో ఏకరూపతను తీసుకొచ్చేలా కేంద్రం జాతీయ విధానాన్ని రూపొందించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రాలకు ఆక్సిజన్‌ సరఫరా జరిగేలా కేంద్రం చూడాలంటూ ట్వీట్ చేశారు. ‘‘టీకా ధరలు ఒకేలా లేవు. కేంద్ర, రాష్ట్రాలు, ప్రైవేటు సంస్థలకు ఒక్కోవిధంగా ధరలు నిర్ణయించారు. ఈ విషయంలో కేంద్రం జోక్యంచేసుకొని జాతీయ విధానాన్ని రూపొందించాలి. టీకా ధరల్లో ఏకరూపతను తీసుకొచ్చి అమలుపరచాలి. దేశ రాజధాని నగరం సహా పలు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత నెలకొన్న నేపథ్యంలో పరిశ్రమల్లో ఆక్సిజన్‌ వాడకాన్ని నిలిపివేయాలి. అత్యవసర ఔషధాల సరఫరాను పెంచడం పైనా కేంద్రం ప్రత్యేక దృష్టిసారించాలి’’ అని మాయావతి కోరారు.

కొత్త వ్యాక్సిన్ విధానం ద్వారా సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కేంద్రానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వాలకు 400, ప్రైవేటు వైద్యశాలలకు రూ.600లకు టీకా అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఒకే వ్యాక్సిన్‌కు మూడు ధరలా అంటూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ తప్పుపట్టారు. దేశంలోని 18 నుంచి 45 ఏళ్ల వయసు వారికి ఉచిత టీకా అందించడం నుంచి ప్రభుత్వం తప్పుకోవడమంటే యువత యోగక్షేమ బాధ్యతలను పూర్తిగా విస్మరించడమేనని పేర్కొంటూ ప్రధానికి నిన్న లేఖ రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని