Gujarat: గుజరాత్‌ తదుపరి ముఖ్యమంత్రిపై కొనసాగుతున్న ఉత్కంఠ!

గుజరాత్‌లో ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ రాజీనామా చేయడంతో అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది....

Published : 12 Sep 2021 12:26 IST

గాంధీనగర్‌: గుజరాత్‌లో ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ రాజీనామా చేయడంతో అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. మరోవైపు ఇదే విషయంపై భాజపా అధిష్ఠానం తర్జనభర్జనలు పడుతోంది. ఈ మేరకు అంతర్గతంగా పలువురు కీలక నేతలు, కేంద్ర మంత్రులతో నాయకులు మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు గుజరాత్‌లో ఈరోజు భాజపా ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఓ నిర్ణయానికి రానున్నారు.

అధిష్ఠానం తరఫున గుజరాత్‌ వ్యవహారాలను పరిశీలిస్తున్న కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, నరేంద్రసింగ్‌ తోమర్‌ ఇప్పటికే గాంధీనగర్‌ చేరుకున్నారు. ఈరోజు వారు పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఈరోజు ఉదయం వీరిద్దరితో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌.. గుజరాత్‌ భాజపా అధ్యక్షుడు సీఆర్‌.పాటిల్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. సాయంత్రం 3 గంటలకు వీరు పార్టీ శాసనభ్యులతో సమావేశం కానున్నట్లు గుజరాత్‌ భాజపా అధికార ప్రతినిధి యమల్‌ వ్యాస్‌ తెలిపారు. 

గుజరాత్‌లో 12 శాతం జనాభాతో ప్రధాన వర్గంగా ఉన్న పాటీదార్‌ (పటేల్‌)లు ఇటీవల కాలంలో ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉండడంతో వారిని సంతృప్తి పరచే చర్యలు చేపడుతారని భావిస్తున్నారు. అందువల్ల తదుపరి సీఎంగా పటేల్‌ వర్గానికి చెందినవారే ఉంటారన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఆ దృష్ట్యా ఆ వర్గానికి చెందిన ఉపముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, లక్షదీప్‌, దాద్రా-నాగర్‌ హవేలీల అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ ఖోడా పటేల్‌, రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఆర్‌.సి.ఫల్దూ పేర్లను కేంద్రం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ఆనందీ బెన్‌ పటేల్‌ రాజీనామా చేసిన అనంతరం ప్రస్తుత ఉపముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ పదవి కోసం ఆయన మొదటి నుంచీ పోటీదారునిగానే ఉన్నారు. ఆయనకే అవకాశాలు ఎక్కువని కొందరు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని