UP Politics: ‘ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే ప్రీ పోల్‌ సర్వేలను నిషేధించాలి’

యూపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇదే క్రమంలో ‘ముందస్తు పోల్‌ సర్వే’ల విషయంలో బీఎస్పీ అధినేత్రి మాయవతి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు నుంచే ఆయా...

Published : 10 Oct 2021 01:35 IST

ఈమేరకు ఈసీకి లేఖ రాస్తా: బీఎస్పీ అధినేత్రి మాయావతి

లఖ్‌నవూ: యూపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇదే క్రమంలో ‘ముందస్తు పోల్‌ సర్వే’ల విషయంలో బీఎస్పీ అధినేత్రి మాయవతి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు నుంచే ఆయా మీడియా సంస్థలు, ఏజెన్సీల ప్రీ పోల్‌ సర్వేలను నిషేధించాలని కోరుతూ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తానని వెల్లడించారు. తద్వారా ఎన్నికలు ప్రభావితం కాకుండా ఉంటాయని అభిప్రాయపడ్డారు. పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌ వర్ధంతి సందర్భంగా శనివారం మాయావతి ఆయనకు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. బహుజనుల అభివృద్ధికి కృషి చేసిన కాన్షీరామ్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.

‘బెంగాల్‌లో ఏమైందో చూశారుగా..’

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో భాజపా అత్యధిక స్థానాలు సాధించి, అధికారాన్ని నిలుపుకొంటుందని స్థానికంగా ఓ న్యూస్‌ ఛానల్‌ సర్వేలో వెల్లడైన తరుణంలో మాయావతి ‘ప్రీ పోల్‌ సర్వే’ నిషేధం గురించి మాట్లాడటం గమనార్హం. ‘పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నట్లు సర్వేలు చూపాయి. తీరా విరుద్ధ ఫలితాలు వచ్చాయి. అధికారం కోసం తపించినవారి కలలు చెదిరిపోయాయి. అందువల్ల ఈ సర్వేల ద్వారా ఓటర్లు తప్పుదోవ పట్టొద్దు’ అని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో అధికార మార్పునకు ప్రజలు ఇప్పటికే సిద్ధమయ్యారని పేర్కొన్నారు. దీంతో కేంద్రం, యూపీ ప్రభుత్వాలు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రాష్ట్ర యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నాయని ఆరోపించారు. చిన్న పార్టీలు, సంస్థలూ భాజపాకు ప్రయోజనం చేకూర్చేందుకు పని చేస్తున్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని