Jinnah: దేశంలో మళ్లీ జిన్నా పేరు.. వివాదాస్పదంగా మారిన యూపీ మాజీ గవర్నర్‌ వ్యాఖ్యలు!

ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో పాకిస్థాన్‌ తొలి గవర్నర్‌ జనరల్‌ మహహ్మద్‌ అలీ జిన్నా పేరు తరచూ వినిపిస్తోంది. ఇటీవల యూపీ మాజీ సీఎం.. సమాజ్‌వాది(ఎస్పీ) పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌,  సుహెల్దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ(ఎస్‌బీఎస్‌పీ) అధ్యక్షుడు ఓ ప్రకాశ్‌ రాజ్‌భర్‌ జిన్నాను ప్రశంసిస్తూ వివాదం లేవనెత్తారు. తాజాగా

Published : 26 Nov 2021 01:45 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో పాకిస్థాన్‌ తొలి గవర్నర్‌ జనరల్‌ మహమ్మద్‌ అలీ జిన్నా పేరు తరచూ వినిపిస్తోంది. ఇటీవల యూపీ మాజీ సీఎం.. సమాజ్‌వాది(ఎస్పీ) పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌,  సుహెల్దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ(ఎస్‌బీఎస్‌పీ) అధ్యక్షుడు ఓ ప్రకాశ్‌ రాజ్‌భర్‌ జిన్నాను ప్రశంసిస్తూ వివాదం లేవనెత్తారు. తాజాగా యూపీ మాజీ గవర్నర్‌, కాంగ్రెస్‌ పార్టీ నేత అజీజ్‌ ఖురేషీ కూడా అదే బాటలో నడుస్తూ అగ్నికి ఆజ్యం పోశారు. జిన్నా అత్యుత్తమ జాతీయవాది అని, కాంగ్రెస్‌ పార్టీలో అత్యంత కీలక నాయకుడిగా ఉండేవారని కీర్తించారు. అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ( ఏఎంయూ)లో జిన్నా చిత్రపటం పెట్టాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  

‘‘జిన్నా గురించి నేను ధైర్యంగా మాట్లాడగలను. అతను అత్యుత్తమ జాతీయవాది. కాంగ్రెస్‌పార్టీలో అగ్రనేతగా, కీలక నాయకుడిగా 20ఏళ్లు ఉన్నారు. ఓసారి తిలక్‌పై దేశద్రోహం కేసు నమోదైతే.. ఆ కేసును వాదించమని తిలక్‌ జిన్నాకే అప్పగించారు. బాంబే హైకోర్టు శతాబ్ది పత్రికలో ఓ చాప్టర్‌ మొత్తం జిన్నా గురించే రాశారు. ముంబయిలో జిన్నా ఇల్లు ఉంది. మరి ఆయన్ను వ్యతిరేకించేవారు.. ఆ ఇంటిని ఎందుకు కూల్చలేదు? జిన్నా వ్యవహారంలో కొందరు ఏఎంయూని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. నిజానికి ఆ యూనివర్సిటీలో జిన్నా భారీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు’’అని అజీజ్‌ ఖురేషీ అన్నారు.   

ఇది వరకు మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. సర్దార్‌ పటేల్‌, మహాత్మ గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, జిన్నా ఒకే ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకొని న్యాయవాదులు అయ్యారని, వారంతా దేశ బానిస సంకెళ్లను తెంచడానికి పోరాటం చేశారని చెబుతూ.. జిన్నాను పొగడ్తలతో ముంచెత్తాడు. దీనిపై స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. అలాంటి వారిది తాలిబన్‌ మనస్తత్వం అంటూ విమర్శించారు. అలాగే, ఎస్‌బీఎస్‌పీ అధ్యక్షుడు కూడా భారత్‌, పాక్‌ విభజన జరగకపోయి ఉంటే.. జిన్నా భారత ప్రధాన మంత్రి అయ్యేవారని వ్యాఖ్యానించారు. వాజ్‌పేయి, ఎల్‌కే అడ్వాణీలకు సైతం ఇలాంటి అభిప్రాయమే ఉండేదని చెప్పుకొచ్చారు. కాగా.. వీరి వ్యాఖ్యలను జాతీయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

Read latest Political News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని