UP Polls: అందుకే భాజపాను వీడా.. ఎస్పీలో చేరిన మూడో మంత్రి!

యూపీలో ఎన్నికల వేళ కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల తన మంత్రి పదవితో పాటు భాజపా సభ్యత్వానికి రాజీనామా చేసిన దారా సింగ్‌ చౌహాన్‌ ......

Published : 17 Jan 2022 01:29 IST

లఖ్‌నవూ: యూపీలో ఎన్నికల వేళ కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల తన మంత్రి పదవితో పాటు భాజపా సభ్యత్వానికి రాజీనామా చేసిన దారా సింగ్‌ చౌహాన్‌ ఆదివారం సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆయనకు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. గత వారం రోజుల వ్యవధిలో భాజపాను వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరిన మూడో మంత్రి దారా సింగ్‌ చౌహాన్‌ కావడం గమనార్హం. ఇటీవల భాజపాకు గుడ్‌బై చెప్పిన మంత్రులు స్వామి ప్రసాద్‌ మౌర్య, ధరమ్‌ సింగ్‌ సమాజ్‌వాదీలో చేరిన  విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా దారాసింగ్‌ చౌహాన్‌ మీడియాతో మాట్లాడారు. 2017లో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ నినాదం ఇచ్చిందన్నారు. కానీ, అభివృద్ధి ఫలాలు కొందరికి మాత్రమే పరిమితమయ్యాయని విమర్శించారు. యూపీలో రాజకీయాలను మారుస్తామనీ.. అఖిలేశ్‌ యాదవ్‌ను మళ్లీ సీఎంని చేస్తామన్నారు. రాష్ట్రంలోని ఓబీసీ, దళిత వర్గాలు ఏకతాటిపైకి వస్తాయనీ.. మార్పు అనివార్యంగా జరుగుతుందన్నారు. భాజపాకు మద్దతు ఇచ్చిన బీసీ వర్గాలకు యోగి ప్రభుత్వంలో సరైన ప్రోత్సాహం లభించలేదన్నారు.

‘గత ఐదేళ్లుగా ఏం చేశారని ప్రజలు అడుగుతున్నారు. ప్రభుత్వం ఏదో చేస్తుందని వెనుకబడిన సమాజం ఓపికగా ఎదురు చూస్తోంది. కానీ ఆ సమాజ ప్రయోజనాలను పూర్తిగా విస్మరించడం చూసి సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం’’ అని దారా సింగ్‌ చౌహాన్‌ అన్నారు. భాజపా పట్ల బ్రాహ్మణుల్లో కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం ఆధారంగా సమాన వాటా దక్కుతుందన్నారు. ఆయనతో పాటు అప్నా దళ్‌ ఎమ్మెల్యే ఆర్కే వర్మ కూడా ఈరోజు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని