Kerala: శైలజా టీచర్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు!

కేరళ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి కేకే శైలజను మరో అంతర్జాతీయ అవార్డు వరించింది. ప్రజారోగ్య కార్యక్రమాల్లో విశేష సేవలకుగానూ సెంట్రల్‌ యురోపియన్‌ యూనివర్సిటీ (CEU) అందించే ప్రతిష్ఠాత్మక ‘ఓపెన్‌ సొసైటీ ప్రైజ్‌’ను ప్రకటించింది.

Updated : 21 Jun 2021 05:00 IST

కేరళ మాజీమంత్రికి అంతర్జాతీయ గుర్తింపు

తిరువనంతపురం: కేరళ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి కేకే శైలజను మరో అంతర్జాతీయ అవార్డు వరించింది. ప్రజారోగ్య కార్యక్రమాల్లో విశేష సేవలకుగానూ సెంట్రల్‌ యురోపియన్‌ యూనివర్సిటీ (CEU) అందించే ప్రతిష్ఠాత్మక ‘ఓపెన్‌ సొసైటీ ప్రైజ్‌’ను ప్రకటించింది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. వైరస్‌ కట్టడికి సమర్థవంతంగా తీసుకున్న చర్యలకు గుర్తింపుగా ఈ పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా సమాజంలో అసాధారణమైన సేవలకు గుర్తింపుగా ఓపెన్‌ సొసైటీ ప్రైజ్‌ను సీఈయూ ప్రతిఏటా అందజేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా జరిగిన 30వ గ్రాడ్యుయేషన్‌ ప్రదానోత్సవం సందర్భంగా కేకే శైలజ ఈ అవార్డుకు ఎన్నికైనట్లు సీఈయూ ప్రకటించింది. కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో.. నాయకత్వ పటిమ, స్థానిక ప్రభుత్వాల సహాయంతో ప్రజారోగ్య సేవలను సమర్థవంతంగా నిర్వహించినందుకు కేకే శైలజా టీచర్‌కు ఈ పురస్కారాన్ని అందజేస్తున్నామని సీఈయూ అధ్యక్షుడు మైఖేల్‌ ఇగ్నటైఫ్‌ పేర్కొన్నారు. ఎంతో మంది మహిళలకు శైలజా టీచర్‌ ఆదర్శంగా నిలవడంతో పాటు కరోనా కట్టడిలో తీసుకున్న చర్యలు పలు దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పారు.

 గతంలో అమెరికా ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత జోసెఫ్‌ స్టిగ్లిట్‌, మరో నోబెల్‌ గ్రహీత స్వెట్లానా, ఐఎంఎఫ్‌ ఎండీ క్రిష్టలినా జార్జీవియా, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ కోఫీ అన్నన్‌ వంటి ప్రముఖులు ఈఅవార్డును తీసుకున్న వారిలో ఉన్నారు. తాజాగా ఈ పురస్కారం రావడం గౌరవంగా భావిస్తున్నానని కేరళ మాజీ మంత్రి శైలజ ఆనందం వ్యక్తం చేశారు.

ఇదిలాఉంటే, కేరళలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షపార్టీ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నాయకత్వంలో కొత్త మంత్రివర్గం ఏర్పాటైనప్పటికీ కేకే శైలజకు మాత్రం చోటు దక్కలేదు. ఆమె రెండోసారి ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రతి ఒక్కరు భావించినప్పటికీ.. పార్టీ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 2018లో ఆరోగ్య మంత్రిగా చేసిన సమయంలోనూ ప్రాణాంతక నిపా వైరస్‌ను నియంత్రించేందుకు చేపట్టిన చర్యలతో కేకే శైలజా అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని