Punjab Politics: పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ! కమలం గూటికి మాజీ మంత్రి

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పంజాబ్‌ రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే రాణా గుర్మిత్‌సింగ్‌ సోధీ పార్టీని వీడి, మంగళవారం భాజపాలో చేరారు. అంతకుముందు కాంగ్రెస్‌కు రాజీనామా...

Updated : 23 Feb 2024 19:44 IST

దిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పంజాబ్‌ రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే రాణా గుర్మిత్‌సింగ్‌ సోధీ పార్టీని వీడి, మంగళవారం భాజపాలో చేరారు. అంతకుముందు కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. ఈ మేరకు సోనియా గాంధీకి పంపిన లేఖను విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర భద్రతను, మత సామరస్యాన్ని పణంగా పెడుతోందని ఆయన  విమర్శించారు. ఈ పరిణామాలతో ఊపిరాడటం లేదని, నిస్సహాయంగా మారినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆయన భాజపా ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, భూపేందర్ యాదవ్ సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో ఎన్నికలకు ముందు పంజాబ్‌లో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయిందని విశ్లేషకులు చెబుతున్నారు.

అమరీందర్‌ సన్నిహితుడిగా పేరు..

గురు హర్ సహాయ్ నుంచి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సోధీ.. దాదాపు నాలుగు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్ సింగ్‌కు సన్నిహితుడిగా పేరుంది. అమరీందర్ హయాంలో మంత్రిగానూ ఉన్నారు. ఆయన రాజీనామా అనంతరం.. సోధీనీ మంత్రివర్గం నుంచి తొలగించారు. కెప్టెన్‌ తర్వాత కాంగ్రెస్‌ను వీడిన మొదటి సిట్టింగ్ ఎమ్మెల్యే సోధీనే. పార్టీలో నిత్యం జరుగుతున్న విభేదాలు, అంతర్గత పోరు తీవ్రంగా బాధించినట్లు అంతకుముందు సోధీ తన లేఖలో పేర్కొన్నారు. పరిస్థితుల పునరుద్ధరణకు చర్యలు తీసుకునే బదులు.. కాంగ్రెస్ సీనియర్ నాయకత్వం వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేయడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. రానున్న ఎన్నికలకు అమరీందర్‌ పార్టీ ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్‌’తో పొత్తు పెట్టుకున్నట్లు భాజపా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని