‘ఆ ప్రాజెక్టుకు జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలి’

కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత జైపాల్ రెడ్డి 78వ జయంతి వేడుకలను నెక్లెస్‌ రోడ్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా జైపాల్‌ రెడ్డి ఘాట్‌ వద్ద శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో పాటు కొణిజేటి రోశయ్య, వీహెచ్‌, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, చిన్నారెడ్డి, తదితరులు నివాళలర్పించారు.

Updated : 16 Jan 2020 14:15 IST

నెక్లెస్‌ రోడ్డులో జైపాల్‌రెడ్డి జయంతి వేడుకలు 
ఆయన ఘాట్‌ వద్ద పలువురు నేతల నివాళి

హైదరాబాద్‌: కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత జైపాల్ రెడ్డి 78వ జయంతి వేడుకలను నెక్లెస్‌ రోడ్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా జైపాల్‌ రెడ్డి ఘాట్‌ వద్ద శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో పాటు కొణిజేటి రోశయ్య, వీహెచ్‌, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, చిన్నారెడ్డి, తదితరులు నివాళలర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ జైపాల్‌రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని కాంగ్రెస్‌ ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.  


‘‘తెలంగాణ రాష్ట్ర సాధనలో జైపాల్‌ రెడ్డి చూపిన చొరవ మరువలేనిది. హైదరాబాద్‌ నగరం తెలంగాణ రాష్ట్రానికి ఉండడానికి కారణం ఆయనే. హైదరాబాద్‌కు మెట్రో రైల్‌ రావడానికి కేంద్రమంత్రిగా ఆయన ఎంతో కృషిచేశారు. ప్రస్తుత రాజకీయ నాయకులందరికీ ఆయన ఆదర్శప్రాయుడు’’

- గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ 


‘‘జైపాల్‌ రెడ్డి లేరన్న విషయం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా. తెలంగాణ జాతికి మహానేత అయిన జైపాల్‌ రెడ్డి నాకు పితృ సమానులు. ఆయన నన్ను తన కుటుంబంలో ఓ సభ్యుడిలా చూసేవారు. ఆయన పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాలు తెలంగాణ ఖ్యాతిని పెంచాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్‌ రెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. క్రమశిక్షణ, విలువలు కలిగిన వ్యక్తి జైపాల్ రెడ్డి’’ - ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు.


‘‘జైపాల్‌రెడ్డి మరణం ఊహించనిది. ఆయన సేవలు దేశానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. దేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన జైపాల్‌ రెడ్డిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి. రాజకీయాల్లో నిజాయతీ, నిబద్ధత కల్గిన వ్యక్తి జైపాల్‌రెడ్డే. అపార మేధస్సు ఆయన సొంతం’’ - చిన్నారెడ్డి, కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి. 


‘‘దేశ రాజకీయాల్లో అవినీతి మరకలేని ఏకైక నాయకుడు జైపాల్‌ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తన వంతు పాత్ర పోషించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రమంత్రిగా నిధులు ఇచ్చారు. సమైక్యవాది అయిన జైపాల్‌ రెడ్డి సోనియా, రాహుల్‌ను ఒప్పించి తెలంగాణ రావడంలో కీలకంగా వ్యవహరించారు. పాలమూరు ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని సీఎంను కోరుతున్నాం’’ - కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ.


‘‘ఏ విషయంపైనైనా ఎంతో అవగాహనతో మాట్లాడేవారు. పార్లమెంట్‌లో ఆయన ప్రసంగాన్ని అంతా ఆసక్తిగా వినేవారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు. నిరుద్యోగులు ఇంకా రోడ్లమీదే ఉన్నారు’’ - వీహెచ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని