ఆ ప్రచారంలో వాస్తవం లేదు: కొడాలి నాని

రాష్ట్రంలో పింఛన్లలో భారీగా కోత విధించారంటూ జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 39లక్షల మంది పింఛన్లు ..

Updated : 02 Feb 2020 17:48 IST

అమరావతి: రాష్ట్రంలో పింఛన్లలో భారీగా కోత విధించారంటూ జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 39లక్షల మందికి పింఛన్లు అందేవని.. జగన్‌ సీఎం అయ్యాక 54లక్షల మందికి ఇస్తున్నారని చెప్పారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కొడాలి నాని మాట్లాడారు. ఇంటింటికీ పింఛన్లు అందిస్తూ సరికొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. అమ్మ ఒడి, రైతు భరోసా తదితర సంక్షేమ పథకాలతో కోటి మందికి పైగా తమ ప్రభుత్వం ఆర్థిక సాయం చేసిందన్నారు. తెదేపా హయాంలో మూడంతస్తుల భవనం ఉన్నవారికి, అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారని.. వాటన్నింటినీ సమీక్షించి అక్రమంగా పొందుతున్న పింఛన్లను మాత్రమే ప్రభుత్వం తొలగించిందన్నారు. నిజమైన అర్హులకు పింఛను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎవరైనా అర్హులు ఉండి పింఛను రాకపోతే దరఖాస్తు చేసిన 72 గంటల్లో అందజేస్తామని నాని స్పష్టం చేశారు. 

మా దృష్టిలో మండలి రద్దయింది

జగన్‌ ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు తెదేపా మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి లేదని కొడాలి నాని అన్నారు. ఆయన తన మాటతీరు మార్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా కంటే ప్రమాదకరమైన ఎల్లో వైరస్‌ ఉందని.. అది చాలా భయంకరమైందని వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మంత్రి చెప్పారు. రూ.25వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఖర్చు పెట్టిందని.. వాటికి కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందన్నారు. కేంద్రానికి తగిన సమయంలో తమ నిరసన తెలియజేస్తామని చెప్పారు. ఈ విషయంలో వైకాపా ఎంపీలు కేంద్ర పెద్దలను కలిసి తగిన ఒత్తిడి తీసుకొస్తారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అక్రమంగా ఇసుక తరలించిన వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మా దృష్టిలో శాసన మండలి రద్దయింది.. త్వరలో కేంద్ర ప్రభుత్వం కూడా రద్దుకు ఆమోదం తెలుపుతుందని నాని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని