ఎమ్మెల్యేలను తరలిస్తున్న కాంగ్రెస్‌

గుజరాత్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరగబోయే ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తమైంది. అధికార భాజపాకు తమ ఎమ్మెల్యేలు చిక్కకుండా వారిని వేర్వేరు చోట్లకు తరలిస్తోంది.

Published : 15 Mar 2020 01:36 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరగబోయే ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తమైంది. అధికార భాజపాకు తమ ఎమ్మెల్యేలు చిక్కకుండా వారిని వేర్వేరు చోట్లకు తరలిస్తోంది.  ఈ నెల 26న ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ముందుగానే వారిని తరలింపు ప్రక్రియ వేగవంతం చేసింది. సుమారు 12 మంది ఎమ్మెల్యేలు శనివారం అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో కనిపించారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. వీరిని తరలిస్తుండడం గమనార్హం.

మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను భాజపా ముగ్గురు, కాంగ్రెస్‌ ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపింది. 182 స్థానాలున్న శాసనసభలో భాజపాకు 103 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్‌కు 73 మంది ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రెండు సీట్లు గెలవాలంటే 74 మంది అవసరం ఉండగా.. ఇప్పటికే స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న జిగ్నేష్‌ మేవానీ కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. అయితే, భాజపా ముగ్గురిని బరిలోకి దింపింది. ముగ్గురిని గెలిపించుకోవాలంటే భాజపాకు 111 మంది ఎమ్మెల్యేలు అవసరం. దీంతో భాజపా కాంగ్రెస్‌ సభ్యులను ఎక్కడ తమవైపు తిప్పుకొని క్రాస్‌ ఓటింగ్‌కు పురిగొల్పుతుందోనని హస్తం పార్టీ తమ ఎమ్మెల్యేలను తరలిస్తోంది. దీంతో వారిని వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తోంది. ముఖ్యంగా తమ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని