Goa polls: గోవాలో పార్టీలకు ఫిరాయింపుల భయం..నివారణకు ఏం చేస్తున్నాయంటే?

గోవాలో పార్టీలకు ఫిరాయింపుల భయం పట్టుకుంది. గెలిచిన తర్వాత సభ్యులు ఎక్కడ పార్టీ మారతారోనని ముందుగానే జాగ్రత్త పడుతున్నారు.

Published : 24 Jan 2022 02:02 IST

పనాజీ: వచ్చే నెల గోవాలో అసెంబ్లీ ఎన్నికలు (Goa polls) జరగనున్న నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో పార్టీలకు ఫిరాయింపుల భయం పట్టుకుంది. గెలిచిన తర్వాత సభ్యులు ఎక్కడ పార్టీ మారతారోనని ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. ‘అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రీఫార్మ్స్‌ (ADR)’ వివరాల ప్రకారం.. గోవాలో గత ఐదేళ్లలో 24 మంది ఎమ్మెల్యేలు అంటే అక్కడి అసెంబ్లీలో 60 శాతం సామర్థ్యానికి సమానమైన సభ్యులు పార్టీలు మారారు. ఈ నేపథ్యంలోనే పలు పార్టీలు ఫిరాయింపుల నివారణకు చర్యలు తీసుకోవాల్సి వస్తోంది.

కాంగ్రెస్‌..  దేవుడి ముందు ప్రమాణం..

దేశవ్యాప్తంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ (Congress)కు ఈ రాష్ట్రంలోనూ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. భాజపా (BJP) అధికారంలో ఉన్న గోవాలో.. గత ఐదేళ్లలో కాంగ్రెస్‌ నుంచి అనేక మంది ఫిరాయించారు. దీంతో ఈసారి పార్టీ ముందు జాగ్రత్త చర్యలకు దిగింది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల నుంచి పార్టీ మారబోమని ముందుగానే హామీ తీసుకుంటోంది. అందుకోసం పార్టీ అభ్యర్థులతో దేవుడి ముందు ప్రమాణం చేయించింది. ఈ మేరకు మొత్తం 34 మంది అభ్యర్థుల్ని వారి విశ్వాసాల మేరకు దేవాలయం, చర్చి, దర్గాకు తీసుకెళ్లి పార్టీ మారబోమని శనివారం ప్రమాణం చేయించింది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనేక మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. 40 శాసనసభ స్థానాలున్న గోవాలో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 17 సీట్లలో గెలుపొంది ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. అలాంటిది ప్రస్తుతం సభలో ఇద్దరు మాత్రమే ఉండడం గమనార్హం. 2019లో అనేక మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపాలో చేరారు. 

‘‘ప్రజల్లో విశ్వాసం కలిగించేలా అభ్యర్థులందరితో దేవుడి ముందు ప్రమాణం చేయించే కార్యక్రమం చేపట్టాం’’ అని గోవా పీసీసీ అధ్యక్షుడు గిరీశ్‌ చోడంకర్‌ తెలిపారు. అందుకోసం పనాజీలోని మహాలక్ష్మీ ఆలయానికి, బాంబోలిమ్‌లోని చర్చికి, బెటిం గ్రామంలోని దర్గాకు అభ్యర్థులను తీసుకెళ్లామని పేర్కొన్నారు. వీరితో పాటు పార్టీ అధిష్ఠానం తరఫున రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జిగా ఉన్న పి.చిదంబరం సైతం వెళ్లడం గమనార్హం.

ఏడాది ముందే జాగ్రత్త!

అభ్యర్థులతో దేవుడి ముందు ప్రమాణం చేయించడం గోవాలో కొత్తేమీ కాదు. గత ఏడాది జనవరి 31న ‘గోవా ఫార్వర్డ్‌ పార్టీ (GFP)’ సైతం ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టింది. 2022లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపాకు మద్దతునివ్వబోమని పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఇతర కీలక నాయకులతో ఏడాది ముందే ప్రమాణం చేయించింది. అయినప్పటికీ జీఎఫ్‌పీకి చెందిన జయేశ్‌ సల్‌గోవాంకర్‌ తర్వాత భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన శాల్గావ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున బరిలో ఉన్నారు. 2017లో మనోహర్‌ పారికర్‌ నేతృత్వంలో ఏర్పాటైన భాజపా ప్రభుత్వానికి జీఎఫ్‌పీ మద్దతుగా నిలిచింది. ఫలితంగా ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. కానీ, 2019లో 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భాజపాలో చేరిన తర్వాత జీఎఫ్‌పీ సభ్యులను సీఎం ప్రమోద్‌ సావంత్‌ మంత్రి వర్గం నుంచి తొలగించారు. దీన్ని పరాభవంగా భావించిన జీఎఫ్‌పీ నేత విజయ్‌ సర్దేశాయ్.. భాజపాతో చేతులు కలిపేది లేదని ప్రకటించి సభ్యులతో ప్రమాణం చేయించారు. 

ఆప్‌ ఇలా..

మరోవైపు గోవా ఎన్నికల బరిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP‌) సైతం ఫిరాయింపులను అరికట్టేందుకు ఇదే తరహా చర్యలు చేపట్టింది. పోటీ చేయనున్న తమ అభ్యర్థులు గెలిచిన తర్వాత పార్టీ మారబోమని ‘లీగల్‌ అఫిడవిట్‌’లపై సంతకాలు చేయాల్సి ఉంటుందని ప్రకటించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని