Huzurabad by-election: హుజూరాబాద్‌ ఫలితంపై ఉత్కంఠ.. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో జరిగే ఓట్ల లెక్కింపునకు అధికారులు

Updated : 09 Aug 2022 12:30 IST

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో జరిగే ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మంగళవారం ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 753 పోస్టల్‌ ఓట్లు నమోదు కాగా.. మొదటి అరగంట పాటు వాటిని లెక్కించనున్నారు. అనంతరం జరిగే ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లు ఏర్పాటుచేశారు. ఒక్కో హాలులో 7టేబుళ్ల చొప్పున మొత్తంగా 14 టేబుళ్లు సిద్ధంచేశారు. వీవీప్యాట్‌ తరలింపు గందరగోళంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్ రూమ్‌లోని పరిస్థితిని తెలుసుకొనేందుకు సీసీ కెమెరా దృశ్యాలను బయట ప్రదర్శించాలని నిర్ణయించారు. సాయంత్రం 4గంటల వరకు ఫలితం వెలువడే అవకాశం ఉండగా.. రికార్డు స్థాయిలో పోలింగ్‌ తమకే అనుకూలమని ఆయా ప్రధాన రాజకీయ పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. 

22 రౌండ్లలో లెక్కింపు

ఉప ఎన్నిక కౌంటింగ్‌ 22 రౌండ్లలో కొనసాగనుంది. ఒక్కో రౌండ్‌ ఫలితానికి 20 నుంచి 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే, ఎక్కువమంది అభ్యర్థులు బరిలో ఉండటంవల్ల తుది ఫలితం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తొలుత హుజూరాబాద్‌ మండలంలోని 14 గ్రామాలు, అనంతరం వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపూర్‌ మండలాల ఓట్లను లెక్కింపు చేపడతారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన వీవీప్యాట్‌ వీడియోపై ఆయన వివరణ ఇచ్చారు. రవాణా చేసే సమయంలో దాన్ని వీడియో తీసి.. వైరల్‌ చేశారని స్పష్టంచేశారు. దానివల్ల ఎలాంటి సమస్యా లేదన్నారు. మరోవైపు, ఏపీలో కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కూడా నేడు జరగనుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని