Akhilesh Yadav:అపర్ణకు సర్దిచెప్పేందుకు నాన్న ఎంతో ప్రయత్నించారు.. కానీ..!

త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలు(UP Election 2022).. ఫిరాయింపులు, హామీలు, మాటలతూటాలతో వేడెక్కుతున్నాయి.

Published : 20 Jan 2022 02:04 IST

యూపీ ఎన్నికల వేళ.. ఇంట్లో చోటుచేసుకున్న పరిణామాలపై అఖిలేశ్‌

లఖ్‌నవూ: త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలు(UP Election 2022).. ఫిరాయింపులు, హామీలు, మాటల తూటాలతో వేడెక్కుతున్నాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్(Aparna Yadav) భాజపాలో చేరడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్(Akhilesh Yadav) మీడియాతో మాట్లాడుతూ.. ఆమె తమ పార్టీ సిద్ధాంతాలను భాజపాలోకి తీసుకెళ్తారని ఆశిస్తున్నట్లు తనశైలిలో స్పందించారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేని వారికి భాజపా టికెట్లు ఇస్తుందని, ఇందుకు ఆ పార్టీకి కృతజ్ఞతలంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అలాగే ఆమె పార్టీ వీడకుండా నేతాజీ(ములాయం సింగ్) ఒప్పించే ప్రయత్నం చేశారని తెలిపారు.  

అపర్ణ పార్టీ వీడటాన్ని ఉద్దేశించి అఖిలేశ్ మాట్లాడుతూ..‘ఈ సందర్భంగా ఆమెకు కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ రకంగా సమాజ్‌వాదీ పార్టీ సిద్ధాంతాలు విస్తరిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మా సిద్ధాంతాలు అక్కడికి చేరి, ప్రజాస్వామ్యం వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నాను’ అని వెల్లడించారు. 

అలాగే ‘ఆమె పార్టీ వీడకుండా చూసేందుకు నేతాజీ తీవ్రంగా ప్రయత్నం చేశారు. అంతర్గతంగా నిర్వహించే సర్వేల ఆధారంగా పార్టీ టికెట్లు ఇస్తాం. ఇంకా చాలా విషయాలు పరిగణనలోకి తీసుకుంటాం’ అని అఖిలేశ్ వెల్లడించారు.  పార్టీ టికెట్ దక్కకే ఆమె ఎస్పీని వీడి, భాజపాలో చేరినట్లు ఈ మాటలను బట్టి వెల్లడవుతోంది. 

ప్రజలు అనుమతిస్తే అక్కడి నుంచి పోటీ.. 

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్ మొదటిసారి బరిలో నిలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాటిపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించారు. ‘నేను ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే, అజంగఢ్‌ ప్రజల అనుమతి తీసుకుంటాను. ఆ నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. అందుకే నేను వారి అనుమతి తీసుకోవాల్సి ఉంది’ అని వెల్లడించారు. ఆయన అజంగఢ్‌లోని గోపాల్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మొదటిసారి రాష్ట్ర ఎన్నికల్లో పోటీ పడనున్నట్లు చేసిన ప్రకటన అఖిలేశ్‌పై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని