Published : 26/11/2021 01:49 IST

Meghalaya: కాంగ్రెస్‌ను ‘పీకే’స్తున్నాడా..? ఆయన దెబ్బకు మేఘాలయలో ‘హస్త’వ్యస్తం..!

మేఘాలయ పరిణామాల వెనుక రాజకీయ వ్యూహకర్త!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు గట్టి కుదుపు.. ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి పార్టీని వీడి తృణమూల్‌ గూటికి పయనం.. దెబ్బకు ప్రతిపక్ష హోదా గల్లంతు.. రాత్రికి రాత్రే మారిన సమీకరణాలు.. ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో హస్తం పార్టీ అస్తవ్యస్తానికి కారణమేంటీ అంటే.. ప్రశాంత్‌ కిశోర్‌ పేరు వినిపిస్తోంది. ఆయన వ్యూహానికి ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్‌ కోట పేకమేడలా కూలిపోయింది..!!

మేఘాలయలో కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ తగిలిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు బుధవారం రాత్రి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి ముకుల్‌ సంగ్మా కూడా ఉండటం గమనార్హం. మొత్తం 60 సీట్లు ఉన్న అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షం తరఫున 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో కొంతమంది ఆ తర్వాత పార్టీ మారగా.. కాంగ్రెస్‌ సంఖ్యా బలం 17కు తగ్గింది. ఇప్పుడు ఇందులోని 12 మంది టీఎంసీ గూటికి చేరడంతో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల చేరికతో ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. తృణమూల్‌ రాత్రికి రాత్రే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించడం గమనార్హం. 

పీకే డైరెక్షన్‌లో మాజీ సీఎం యాక్షన్‌.. 

కాంగ్రెస్‌ను వీడటానికి కొద్ది రోజుల ముందు మాజీ సీఎం ముకుల్‌ సంగ్మా కోల్‌కతా వెళ్లారు. అక్కడ ప్రశాంత్‌ కిశోర్‌తో సంగ్మా భేటీ అయ్యారు. అయితే అది మర్యాద పూర్వక భేటీ మాత్రమే అని చెప్పినప్పటికీ ముకుల్‌ పార్టీ మారే అవకాశాలున్నట్లు అప్పటి నుంచే సంకేతాలు కన్పించాయి. ఆ తర్వాత దిల్లీలోనూ వీరిద్దరూ పలుమార్లు భేటీ అయ్యారు.  తాజాగా ఆయన మాట్లాడుతూ పీకే గురించి ప్రస్తావించారు. ‘‘నా స్నేహితుడు ప్రశాంత్‌ కిశోర్‌ను కలవడం ఆనందంగా ఉంది. మా ఇద్దరి లక్ష్యాలు ఒకటే. మార్పు కోసం నిరంతరం తపించే నాకు ఇదే సరైన సమయమని పీకే సూచించారు’’ అని చెప్పడం గమనార్హం. 

కాంగ్రెస్‌ కోటకు బీటలు..

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ పార్టీకి హ్యాట్రిక్‌ విజయాన్ని అందించిన పీకే.. ఇప్పుడు మేఘాలయలోనూ టీఎంసీతో కలిసి పనిచేస్తున్నారు. కొద్ది నెలల క్రితం ప్రశాంత్ కిశోర్‌ కూడా మేఘాలయలో కన్పించారు. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీపై అంసతృప్తిగా ఉన్న సంగ్మాపై దృష్టి పెట్టి ఆ పార్టీని గట్టిగా దెబ్బ కొట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో బలమైన పార్టీగా కొనసాగిన కాంగ్రెస్‌కు మేఘాలయలో గట్టి పట్టు ఉంది. అయితే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మిత్రపక్షమైన నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. ఎన్డీయేతో జట్టుకట్టింది. ఆ ఎన్నికల్లో ఎన్‌పీపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఓటమి నుంచి కోలుకుని వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. హస్తం పార్టీ ఆశలపై పీకే నీళ్లు గుమ్మరించారు. 

ఆ నిర్ణయమే కొంపముంచిందా..

మేఘాలయ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చీఫ్‌గా విన్సెంట్‌ పాలాను నియమిస్తూ ఇటీవల అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ముకుల్‌ సంగ్మా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి సంగ్మా, పార్టీకి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే తన అనుయాయులతో కలిసి సంగ్మా.. కాంగ్రెస్‌కు బై చెప్పి తృణమూల్‌లో చేరారు. ఈశాన్య భారత కాంగ్రెస్‌లో బలమైన నేతగా పేరొందిన ముకుల్‌ సంగ్మా.. పార్టీని వీడటం హస్తం పార్టీకి గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఈ పరిణామాలతో మేఘాలయాలో టీఎంసీ.. కాంగ్రెస్‌ కంటే బలమైన ప్రతిపక్ష పార్టీగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని