
punjab elections: సవాళ్లు విసురుకుంటున్న ఆప్.. కాంగ్రెస్ పార్టీలు!
దిల్లీ: వచ్చే ఏడాది పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హామీల వర్షం కురిపిస్తున్నారు. అయితే, పంజాబ్‌లో అధికారమే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్న ఆప్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేతలు విమర్శలతోపాటు సవాళ్లు.. ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా పంజాబ్ విద్యాశాఖ మంత్రి విసిరిన సవాల్‌ను కేజ్రీవాల్ స్వీకరించారు. పంజాబ్ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలంటూ ఘాటుగా స్పందించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఇటీవల దిల్లీ విద్యాశాఖ మంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని విమర్శలు చేస్తూ.. దిల్లీ, పంజాబ్‌లో పది చొప్పున పాఠశాలలను ఎంపిక చేసి వాటి పరిస్థితిని సమీక్షిద్దామని, ఏ పాఠశాలలు మెరుగ్గా ఉన్నాయో చూద్దామని సవాల్ విసిరారు. దీనికి స్పందించిన పంజాబ్ విద్యాశాఖ మంత్రి పర్గత్ సింగ్ ‘పది కాదు, 250 పాఠశాలల స్థితిగతులు పరిశీలిద్దాం.. మీరు సిద్ధమా?’అని ఆప్ నేతలకు సవాల్ విసిరారు. ఆప్ ప్రభుత్వం కేవలం పది పాఠశాలలకే బడ్జెట్ కేటాయించి మెరుగు పర్చిందని.. వాటినే ప్రచారంలో వాడుకుంటుందని పర్గట్ సింగ్ విమర్శించారు. దిల్లీ, పంజాబ్‌లోని పాఠశాలల మౌలిక వసతుల గురించి చర్చ జరగాలని అన్నారు.
పర్గత్ సింగ్ సవాల్‌ను కేజ్రీవాల్ స్వీకరించారు. విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా దిల్లీలోని 250 పాఠశాల జాబితాను విడుదల చేస్తారని, పర్గత్ కూడా పంజాబ్‌లోని 250 పాఠశాలల జాబితాను విడుదల చేస్తే చర్చకు వస్తామని ప్రకటించారు. మరి దీనిపై పర్గత్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
► Read latest Political News and Telugu News
ఇవీ చదవండి
Advertisement