సువేందు గెలుపుపై హైకోర్టులో దీదీ సవాల్‌!

నందిగ్రామ్‌లో భాజపా నేత సువేందు అధికారి గెలుపును పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  హైకోర్టులో సవాల్‌ చేశారు. ఈ మేరకు ఆమె కోల్‌కతా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  మార్చి - ఏప్రిల్‌లో .....

Updated : 18 Jun 2021 14:52 IST

కోల్‌కతా: నందిగ్రామ్‌లో భాజపా నేత సువేందు అధికారి గెలుపును పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఈ మేరకు ఆమె కోల్‌కతా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు అపూర్వమైన ‘హ్యాట్రిక్‌’ విజయం అందించిన దీదీ.. తొలిసారి నందిగ్రామ్‌ నుంచి బరిలో దిగి ఒకప్పటి తన కుడి భుజంలా ఉన్న నాయకుడు సువేందు అధికారి చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే.  

మే 3న జరిగిన ఓట్ల లెక్కింపులో నందిగ్రామ్‌ ఫలితం క్షణం క్షణం ఉత్కంఠ రేపింది. మమతా బెనర్జీ, సువేందు అధికారి మధ్య రౌండ్‌ రౌండుకూ ఆధిక్యం చేతులు మారడంతో విజయం చివరి వరకూ దోబూచులాడింది. అర్ధరాత్రి వరకు కొనసాగిన ఉత్కంఠ అనంతరం చివరకు దాదాపు 1700 ఓట్ల తేడాతో సువేందు అధికారి గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. 

ఓట్ల లెక్కింపు మరుసటి రోజు దీదీ మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు సందర్భంలో దాదాపు నాలుగు గంటల పాటు సర్వర్లు డౌన్‌ కావడం అవకతవకలు జరిగేందుకు అవకాశం ఉన్నట్టు అనుమానం వ్యక్తంచేశారు. గవర్నర్‌ కూడా తాను గెలిచినట్టుగా అభినందనలు తెలిపారని, కానీ అకస్మాత్తుగా అంతా మారిపోయిందంటూ ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తన నియోజకవర్గంలో ఎన్నికల అధికారికి బెదిరింపులు కూడా వచ్చాయంటూ విలేకర్ల సమావేశంలో అన్నారు. ఈ నేపథ్యంలో ఆమె సువేందు అధికారి గెలుపును సవాల్‌ చేస్తూ తాజాగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను జస్టిస్‌ కౌశిక్‌ చందా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారించనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని