వీల్‌ఛైర్‌లో మమత రోడ్‌షో

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల పోరు మొదలైంది. గత శనివారం(మార్చి 27న) తొలి విడత పోలింగ్‌ జరగగా.. ఏప్రిల్‌

Published : 29 Mar 2021 13:08 IST

నందిగ్రామ్‌: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల పోరు మొదలైంది. గత శనివారం(మార్చి 27న) తొలి విడత పోలింగ్‌ జరగగా.. ఏప్రిల్‌ 1న రెండో దశ ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఎన్నికల్లో హాట్‌సీట్‌గా మారిన నందిగ్రామ్‌ నియోజకవర్గానికి రెండో దశలోనే పోలింగ్‌ జరగనుంది. దీంతో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రచార జోరు పెంచారు. నేడు నందిగ్రామ్‌లో పర్యటించిన ఆమె.. వీల్‌ఛైర్‌లో కూర్చుని రోడ్‌షో చేపట్టారు. 

నందిగ్రామ్‌లోని రేయపర ఖుదీరామ్‌ మోర్‌ నుంచి ఠాకూర్‌చౌక్‌ వరకు 8 కిలోమీటర్లు దీదీ రోడ్‌షో నిర్వహించారు. వీల్‌ఛైర్‌లో ఉన్న మమతను సిబ్బంది తీసుకురాగా.. ఆమె వెనుక ఇతర నేతలు, తృణమూల్‌ కార్యకర్తలు పాదయాత్ర చేశారు. అనంతరం ఆమె బహిరంగ సభలో మాట్లాడనున్నారు. 

మాజీ మంత్రి సువేందు అధికారి భాజపాలో చేరిన నేపథ్యంలో దీదీ నందిగ్రామ్‌ బరిలో దిగి ప్రత్యర్థులకు సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. దీంతో మమతను ఎదుర్కొనేందుకు భాజపా కూడా సువేందునే పోటీకి దించింది. దీంతో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడ గెలుపు కోసం భాజపా, తృణమూల్‌ విస్తృతంగా శ్రమిస్తున్నాయి. నామినేషన్‌ వేసినప్పటి నుంచి జోరుగా ప్రచారం చేస్తున్న మమత.. పోలింగ్‌ పూర్తయ్యే వరకు తాను ఇక్కడే ఉంటానని ప్రకటించారు. అటు భాజపా కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నందిగ్రామ్‌లో రోడ్‌షో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని