Mamata banerjee: తృణమూల్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా దీదీ

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఎన్నికయ్యారు. ఆ పార్టీ ఎంపీలంతా కలిసి తమ పార్టీ .....

Published : 24 Jul 2021 00:32 IST

దిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఎన్నికయ్యారు. ఆ పార్టీ ఎంపీలంతా కలిసి తమ అధినేత్రిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డెరెక్‌ ఓబ్రెయెన్‌ దిల్లీలో మీడియాకు వెల్లడించారు. చాలా కాలంగా టీఎంసీ పార్లమెంటరీ పార్టీ వెనుక ఉండి ఆమె మార్గదర్శనం చేస్తూ ఉన్నారన్నారు. ఆ వాస్తవికతనే అధికారికంగా ప్రకటిస్తున్నామని, తమ ఛైర్‌పర్సన్‌ ఏడు సార్లు పార్లమెంట్‌ సభ్యురాలిగా కూడా ఉన్నారని ఓబ్రెయెన్‌ గుర్తు చేశారు. పార్లమెంటరీ పార్టీని మార్గదర్శనం చేయడంలో ఆమెకు ఎంతో అనుభవం ఉన్నందునే ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే, మమతా బెనర్జీ పార్లమెంట్‌ సభ్యురాలు కాకపోవడం గమనార్హం.

మరోవైపు, భాజపాకు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని దీదీ ఇటీవల వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇటీవల జరిగిన బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను ఓడించి పార్టీకి హ్యాట్రిక్‌ విజయం సాధించిన దీదీ వైపు విపక్షాలు చూస్తున్నాయని, ఆమె జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకంగా మారబోతున్నారంటూ వార్తలు వస్తున్న వేళ ఈ కీలక పరిణామం చర్చనీయాంశంగా మారింది. వచ్చే వారంలో ఆమె దిల్లీ పర్యటనలో అనేకమంది విపక్ష పార్టీల నేతలు దీదీతో సమావేశం కావాలనుకుంటున్నారని కూడా డెరెక్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని