
AP News: నిరూపిస్తే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటా: కొడాలి నాని
అమరావతి: గుడివాడ కె కన్వెన్షన్ హాల్లో క్యాసినో ఏర్పాటు వివాదంపై మంత్రి కొడాలి నాని స్పందించారు. జూదం నిర్వహించారన్న ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొని, పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానన్నారు. ‘‘సంక్రాంతి పండగకి అన్ని చోట్ల జరిగినట్టుగానే గుడివాడలో కూడా.. జూదం, కోడిపందేలు జరిగాయి. మహిళలను తీసుకొచ్చి డ్యాన్స్‌లు వేయిస్తున్నారని సమాచారం వస్తే.. నేనే స్వయంగా డీఎస్పీకి ఫోన్ చేశా. వెంటనే డీఎస్పీ స్పందించి 5..6 గంటల్లో కార్యక్రమాలన్నీ ఆపించారు. ఛాలెంజ్ చేస్తున్నా.. నా కల్యాణ మండపం 2.5 ఎకరాల్లో ఉంటుంది. అందులో పేకాట, క్యాసినో పెట్టానని నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుని చస్తా’’ అని ఘాటుగా స్పందించారు. క్యాసినో వివాదంపై గుడివాడలో ఇవాళ తెదేపా నిజనిర్ధారణ కమిటీ పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.