Published : 21 May 2022 02:05 IST

NDA: ఎన్‌డీఏ@8ఏళ్లు.. 2014 తర్వాత ప్రభుత్వంపై పెరిగిన విశ్వాసం

స్వార్థపూరిత రాజకీయాలకోసం ప్రతిపక్షాల ఆరాటమన్న ప్రధాని మోదీ

జైపుర్‌: దేశవ్యాప్తంగా సంతులిత అభివృద్ధి, సామాజిక న్యాయంతోపాటు సామాజిక భద్రత కల్పించేందుకే భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అంకితమయ్యిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అంతేకాకుండా 2014 తర్వాత ప్రభుత్వ పాలనపై ప్రజల్లో విశ్వాసం పునరుద్ధరించబడిందన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా జైపుర్‌లో నిర్వహించిన భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుల సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్న ప్రధాని మోదీ.. ప్రభుత్వం అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలు పేదలు, అణగారిన వర్గాల వారికి తప్పకుండా అందేటట్లు చూడాలని భాజపా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

‘ఈ నెలతో ఎన్‌డీఏ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలనను పూర్తి చేసుకుంటుంది. ఈ ఎనిమిదేళ్లలో ఎన్నో తీర్మానాలు, విజయాలు సాధించాం. ప్రజలకు సేవ చేయడం, సుపరిపాలన, పేద ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేశాం’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముఖ్యంగా సన్నకారు రైతులు, కార్మికులు, మధ్యతరగతి కుటుంబాల ఆశలు నెరవేరాయని అన్నారు. సంతులిత అభివృద్ధితో ముందుకెళ్తూనే సామాజిక న్యాయం, సామాజిక భద్రతతోపాటు మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నామన్నారు.

తాము అధికారంలోకి వచ్చిన (2014) తర్వాత ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్నో అంచనాలతో యావత్‌ ప్రపంచం భారత్‌వైపే చూస్తుందన్న ఆయన.. దేశంలోని ప్రజలు కూడా భాజపా వైపు ఆశగా చూస్తున్నారని అన్నారు. ఇలా దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు పెరగడంతో ప్రభుత్వం బాధ్యత కూడా మరింత పెరిగిందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఇక స్వార్థపూరిత రాజకీయాలకోసం ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయన్న మోదీ, ప్రభుత్వంపై విషం చిమ్మేందుకు చిన్న చిన్న సంఘటనల కోసం వెతుకుతున్నాయని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని