UP: మాయావతికి ‘రెబల్స్‌’ షాక్‌ 

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతికి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన 9 మంది రెబల్‌ ఎమ్మెల్యేలు మంగళవారం సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు

Published : 16 Jun 2021 01:20 IST

లఖ్‌నవూ: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతికి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన 9 మంది రెబల్‌ ఎమ్మెల్యేలు మంగళవారం సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ను కలిశారు. త్వరలోనే వారు ఎస్పీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎమ్మెల్యేలను మాయావతి గతంలోనే పార్టీ నుంచి బహిష్కరించారు. 

2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ 19 స్థానాల్లో గెలుపొందింది. అయితే అప్పటి నుంచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో 11 మందిని మాయావతి బహిష్కరించారు. మరో ఎమ్మెల్యే 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలిచారు. దీంతో ప్రస్తుతం పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలే మిగిలారు. కాగా.. బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలపై ఇంకా అనర్హత వేటు పడలేదు. అయితే అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఈ రెబల్‌ ఎమ్మెల్యేల్లో 9 మంది నేడు ఎస్సీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌కు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఏళ్లనాటి వైరాన్ని పక్కనబెట్టి 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్పీ, బీఎస్పీ చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి మహా కూటమిగా పోటీ చేశాయి. అయితే భాజపాలో చేతిలో ఈ కూటమి ఘోర పరాభవం చవిచూసింది. ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను వదిలి.. ఎస్సీ, బీఎస్పీ కలిసి పోటీ చేసినా.. ఆశించిన విజయం దక్కలేదు. మరోవైపు 2019 తర్వాత నుంచి బీఎస్పీ నుంచి చాలా మంది నేతలు, కార్యకర్తలు అఖిలేశ్ పార్టీలో చేరారు. 

కాగా.. రానున్న ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోకూడదని అఖిలేశ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఎస్పీ నుంచి చేరికలు ఆయనకు కలిసొచ్చే పరిణామమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని