
నవరత్నమనే ఉంగరం తొడిగితే సరిపోతుందా? పవన్
విశాఖ: గ్రామాల్లో సమస్యలు తీర్చకుండా నవరత్నమనే ఉంగరం తొడిగితే సరిపోదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖలో జనసేన కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశంలో సంక్షేమం పేరిట అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. సమస్యలపై ఎదురొడ్డి పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘152మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఏమీ పనిచేయకుండా ఉండటానికి కాదు కదా. ప్రజల కోసం మీరంతా పనిచేయడానికి. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేస్తున్నారు. అమ్ముకోవడానికా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది? సంక్షేమం, అభివృద్ధి పక్కపక్కనే ఉండాలి. సంక్షేమం మాత్రమే చేస్తాం.. అభివృద్ధిని పక్కనపెడతాం అంటే సుపరిపాలన కాదు కదా! గుంతలతో నిండిపోయిన రోడ్లతో ఓ ఊరు.. కర్మాగారాలు, కార్యాలయాలు లేని ఒక ఊరు. ఉద్యోగాల్లేని పట్టణాల్లో వ్యవసాయం సరిగాలేని ఊళ్లల్లో మీ చేతికి నవరత్నాల ఉంగరం తొడిగేస్తాం.. మీ కష్టాలు తీరిపోతాయ్.. మీకు డబ్బులు వచ్చేస్తాయ్ అంటే మన ఆకలి తీరిపోతుందా? కేవలం కొంతమందికి నవరత్నాలు అని ఒక ఉంగరం ఇచ్చి దాన్నే అభివృద్ధి అంటే మిగతా 70శాతం మంది ఏం చేయాలి? చూస్తూ కూర్చొని ఉండాలా?’’ అని పవన్ ప్రశ్నించారు.
Advertisement