Updated : 31/10/2021 20:49 IST

Pawan Kalyan: నాయకుడు, కవి.. కార్మికుల వైపు నిలబడాలి: పవన్‌ కల్యాణ్‌

విశాఖపట్నం: ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ నినాదంతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉక్కు ఉద్యమానికి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా విశాఖలోని స్టీల్‌ ప్లాంట్‌ కూర్మన్నపాలెం గేటు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పాల్గొని సంఘీభావం తెలిపారు. జనసేన నేతలు నాదెండ్ల మనోహర్‌, హరిప్రసాద్‌, విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు సభలో పాల్గొన్నారు. అంతకుముందు విశాఖ విమానాశ్రయం నుంచి కూర్మన్నపాలెంగేటు సభా స్థలి వరకు పవన్‌ కల్యాణ్‌ వెంట జనసైనికులు భారీ ర్యాలీగా తరలివచ్చారు. పవన్‌ కల్యాణ్‌ ఉపన్యాసం ప్రారంభంలో శ్రీశ్రీ రాసిన ‘నేను సైతం’ కవితను చదివి వినిపించారు. ‘‘నాయకుడు, కవి ఎప్పుడూ కార్మికులవైపు నిలబడాలి. దేశ ప్రగతికి ఉక్కు కర్మాగారాలు చాలా ముఖ్యం. ఉక్కు కర్మాగారాలు లేకపోతే ఆ దేశం ముందుకు వెళ్లదు. ఉక్కు పరిశ్రమ రావడంలో ఏయూ విద్యార్థుల పాత్ర కూడా ఉంది. ఎందరో పోరాటం చేస్తేనే విశాఖ ఉక్కు పరిశ్రమ ఇక్కడకు వచ్చింది. ఉక్కు ఉద్యమంలో ఆనాడు పోలీసు కాల్పుల్లో 32 మంది చనిపోయారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదం అందరిలో భావోద్వేగం నింపింది’’ అని పవన్‌ వివరించారు.

రాష్ట్ర పాలకులను బాధ్యులను చేయాలి...

‘‘విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. హోం మంత్రి అమిత్‌షాను కలిసి ప్రైవేటీకరణ చేయొద్దని కోరాం. నా వెనుక ఎంపీలు, ఎమ్మెల్యేలు లేరు. మాకున్న ఒక్క ఎమ్మెల్యేను వైకాపా లాక్కెళ్లింది. ప్రజాబలం ఉందనే నాకు ఎవరైనా అపాయింట్‌మెంట్‌ ఇస్తారు. అన్నింటికీ ఉన్నట్లే విశాఖ ఉక్కు పరిశ్రమకూ నష్టాలు ఉన్నాయి. ఏ పరిశ్రమకు నష్టాలు రావు? ఏ కంపెనీకి అప్పులు లేవు? అలా నష్టాలు లేని పరిశ్రమ ఏదైనా ఉందంటే అది వైకాపా రాజకీయ పరిశ్రమ మాత్రమే. కార్మికుల కష్టాలు కేంద్రానికి ఏం తెలుస్తాయి. ఇక్కడి సమస్యలు తెలియవు. మన ఎంపీలు కేంద్రానికి చెప్పాలి. స్టీల్‌ ప్లాంట్‌కు భూములు ఇచ్చిన వాళ్లు గుళ్లో ప్రసాదం తిని బతికారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవని ఎందుకు అడగలేదు? గతంలో విశాఖ డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ను కూడా పోరాడి కాపాడుకోగలిగాం. మన పోరాటానికి స్పందించిన ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పరం కాకుండా అపగలిగింది. మన ఎంపీలు రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు. రాష్ట్ర విభజన వేళలోనూ మన ఎంపీలు మాట్లాడలేదని దిల్లీ పెద్దలు ఇప్పటికీ అంటారు. పార్లమెంట్‌కు వెళ్లేది కబుర్లు చెప్పుకునేందుకు.. కాఫీలు తాగేందుకా? కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ముందు రాష్ట్ర పాలకులను బాధ్యులను చేయాలి. విశాఖ ఉక్కు ఎవరి భిక్ష కాదు..  32 మంది ఆత్మ బలిదానంతో పోరాడి సాధించుకున్నాం.

దిల్లీలో మద్దతిచ్చి.. ఏపీలో బంద్‌ చేస్తారా?
పెట్టుబడుల ఉపసంహరణ అనేది కొత్తగా వచ్చింది కాదు. 1992 నుంచే పెట్టుబడుల ఉపసంహరణ ప్రారంభమైంది. కార్మిక సంఘాల పోరాటం వల్లే అనేక పరిశ్రమలు మిగిలాయి. సమస్యలు వస్తే నిలబడతా.. పారిపోయే వ్యక్తిని కాదు. నాకు ముందడుగు వేయడమే తెలుసు.. వెనకడుగు తెలియదు. కేంద్రంలోని పెద్దలు మా మాట వినరని వైకాపా నేతలు చెబుతున్నారు. కానీ, సీఏఏకు ఎందుకు మద్దతిచ్చారు. వ్యవసాయ చట్టాలకు దిల్లీలో మద్దతిచ్చి.. ఏపీలో బంద్‌కు మద్దతిచ్చారు. కేంద్రం తెచ్చిన అనేక బిల్లులకు వైకాపా ఎంపీలు మద్దతిచ్చారు. ద్వంద్వరాజకీయాలు ఎందుకు చేస్తున్నారు. వైకాపా నేతలు కేంద్రానికి ఎందుకు మద్దతిస్తున్నారు? బిల్లులకు మద్దతిచ్చినప్పుడు.. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని 22 మంది ఎంపీలు కేంద్రాన్ని ఎందుకు అడగలేదు? వైకాపా నేతలు.. పోరాటాలు చేసి వచ్చినవారు కాదు. వారికి తెలిసింది.. కాంట్రాక్టులు, పదవులు, సారా డబ్బులే. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ.. ఆంధ్రుల ఆత్మగౌరవ విషయం. నాకు ఒక్క ఎంపీ ఉన్నా ప్రైవేటు బిల్లు పెట్టి చర్చకు తెచ్చేవాడిని. చట్టసభల్లో నేను చాలా బలహీనుడిని. అన్ని పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల నేతలతో మాట్లాడండి. ప్రజల్లో కోపం లేకపోతే సమాజంలో మార్పు రాదు. స్టీల్‌ప్లాంట్‌ రక్షణ కోసం వారంలోగా అఖిలపక్షం పిలవాలి. స్టీల్‌ ప్లాంట్ పరిరక్షణకు వైకాపా నేతలు ఏం చేస్తారో స్పష్టంగా చెప్పాలి? వైకాపా ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తాం. మన పోరాటం మనం చేయకుండా.. కేంద్రాన్ని అనడం నాకిష్టం లేదు’’ అని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని