బెంగాల్‌లో టీఎంసీ ఓటమి ఖరారైంది: మోదీ

బెంగాల్‌లో గత పదేళ్లుగా మహిళలు, దళితులు సహా అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురయ్యారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకే ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలో మార్పును తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు మోదీ కూచ్‌ బెహర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. 

Updated : 06 Apr 2021 16:25 IST

దిల్లీ: బెంగాల్‌లో గత పదేళ్లుగా మహిళలు, దళితులు సహా అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురయ్యారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకే ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలో మార్పును తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు మోదీ కూచ్‌ బెహర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. 

‘గత పదేళ్లుగా రాష్ట్రంలో మహిళలు, దళితులు, వెనకబడిన వర్గాల ప్రజలు, రైతులు, టీ తోట కార్మికులు అన్యాయానికి గురయ్యారు. దానికి తోడు  మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో ‘భాయ్‌పో సర్వీస్‌ ట్యాక్స్‌’ తెచ్చారు. కాబట్టి ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో మార్పును తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది’ అని మోదీ పిలుపునిచ్చారు. ‘దీదీ వారణాసిలో పోటీ చేస్తారని ఎప్పుడైతే టీఎంసీ ప్రకటించిందో.. అప్పుడే ఆ పార్టీ పని అయిపోయిందనే విషయం అందరికీ అర్థమైంది. గత రెండు దశల ఎన్నికల పోలింగ్‌లో ప్రజలు ఎక్కువ శాతం భాజపాకే మద్దతు పలికారు. దీంతో బెంగాల్‌లో టీఎంసీ ఓటమి ఖరారైన విషయం స్పష్టమవుతోంది’ అని మోదీ ఎద్దేవా చేశారు. 

బెంగాల్‌ అసెంబ్లీకి ఇప్పటి వరకు రెండు దశల ఎన్నికల పోలింగ్‌ పూర్తయిన విషయం తెలిసిందే. నేడు మూడో దశలో భాగంగా 31 స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ దశలో భాగంగా 205 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

పార్టీ కంటే దేశమే ముఖ్యం: మోదీ
‘పార్టీ కంటే దేశం ముఖ్యం’ అనే సిద్ధాంతం స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు ఆర్టికల్‌ 370 రద్దు చేయడం ద్వారా తమ పార్టీ డా.శ్యాంప్రసాద్‌ ముఖర్జీ కలల్ని సాకారం చేసిందని అన్నారు. భాజపా 41వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన కార్యకర్తలతో వర్చువల్‌గా నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ‘‘వ్యక్తిగతం కన్నా పార్టీ ముఖ్యం.. పార్టీ కన్నా దేశం ముఖ్యం’ అనే సిద్ధాంతం స్ఫూర్తితో భాజపా పనిచేస్తుంది. డా.శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ కాలం నుంచి ఇప్పటివరకూ పార్టీలో ఇదే సంస్కృతి కొనసాగుతోంది. దేశంలో పార్టీ విస్తరణకు లాల్‌ కృష్ణ ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి ఎంతో కృషి చేశారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేయడం ద్వారా శ్యాంప్రసాద్‌ ముఖర్జీ కలల్ని భాజపా సాకారం చేసింది’ అని మోదీ వెల్లడించారు. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని