Updated : 20/03/2021 14:05 IST

ఐదేళ్లు ఇవ్వండి.. 70ఏళ్ల వృద్ధి చేస్తాం: మోదీ

ఖరగ్‌పూర్‌: పశ్చిమబెంగాల్‌లో ఐదేళ్లు తమకు అవకాశం ఇస్తే.. 70ఏళ్ల అభివృద్ధి చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఖరగ్‌పూర్‌ ర్యాలీలో పాల్గొన్న మోదీ బెంగాల్‌ సీఎం మమతపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. సభకు వచ్చిన ప్రజల ఉత్సాహాన్ని చూస్తే రాబోయే ఎన్నికల్లో బెంగాల్‌లో భాజపా ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయంగా కనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.

‘ఈ రోజు భాజపాను ఆశీర్వదించడానికి ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ సారి బెంగాల్‌లో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విషయాన్ని మీ ఉత్సాహమే చెబుతోంది. బెంగాల్‌ ఉజ్వల భవిష్యత్తు కోసం భాజపా ప్రభుత్వం ఎంతో అవసరం. రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటంలో 130 మంది కార్యకర్తలు తమ ప్రాణాల్ని త్యాగం చేశారు. దిలీప్‌ ఘోష్‌ లాంటి వ్యక్తి ఇక్కడ మా పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నాడని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది. ఆయన్ను చంపేందుకు ఎన్నో దాడులు జరిగాయి. కానీ ఆయన మాత్రం బెంగాల్‌ భవిష్యత్తు కోసం శ్రమిస్తూ.. రాష్ట్రంలో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు’ అని మోదీ తెలిపారు.

టీఎంసీ క్రూరత్వానికి పాఠశాల
‘బెంగాల్‌ ప్రజలు ఎంతో నమ్మకంతో దీదీకి అధికారం అప్పగిస్తే.. ఆమె తిరిగి వారికి అవినీతిని ఇచ్చారు. టీఎంసీ పార్టీ క్రూరత్వానికి పాఠశాల వంటిది. ప్రజలను వేధించి, ఇబ్బందులు పెట్టడానికి అదో శిక్షణ కేంద్రం. ప్రజలు దీదీని పదేళ్ల పాలన గురించి లెక్కలు అడిగితే ఆమెకు కోపం వస్తుంది. ఆంఫన్‌ బాధితుల పరిహారం, రేషన్‌ దోపిడీ, బొగ్గుకుంభకోణం వేటి గురించి అడిగినా జైల్లో పెడుతోంది. బెంగాల్‌లో సువర్ణరేఖ, కంసవతి నదుల్లో అక్రమ మైనింగ్‌ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుందో ఇక్కడ చిన్న పిల్లలకు కూడా తెలుసు. మేం అధికారంలోకి వచ్చాక అలాంటి వాటన్నింటిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బెంగాల్‌లోని పేదల కోసం గత కొన్నేళ్లుగా 33లక్షల పక్కా గృహాలను కేంద్రం ఆమోదించింది. కానీ ఎక్కడ మోదీ ప్రభుత్వానికి పేరు వస్తుందోనని దీదీ ప్రభుత్వం వాటిని ఇంకా పూర్తి చేయడం లేదు’ అని మోదీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంతో అభివృద్ధి
‘బెంగాల్‌ యువతకు కీలకమైన పదేళ్లను దీదీ వ్యర్థం చేశారు. గత రాత్రి వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ 50-55 నిమిషాలు ఆగిపోతేనే అందరూ ఆందోళనకు గురయ్యారు. కానీ బెంగాల్‌లో అభివృద్ధి 50-55ఏళ్లుగా ఆగిపోయింది. కాబట్టి మార్పు కోసం మీలో నెలకొన్న అసహనాన్ని నేను అర్థం చేసుకోగలను. కేంద్రం, రాష్ట్రంలో భాజపా అధికారంలో ఉన్న చోట ప్రభుత్వాలు డబుల్‌ ఇంజిన్‌ తరహాలో సమర్థంగా పనిచేస్తున్నాయి’ అని మోదీ స్పష్టం చేశారు.

‘రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే వ్యవసాయ, నీటిపారుదల సహా శీతల గిడ్డంగుల సౌకర్యాలు సైతం అభివృద్ధి చేస్తాం. అంతేకాకుండా రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు, గ్రామీణ రహదారులు మెరుగవుతాయి. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం. బెంగాల్‌లో మాకు 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వండి.. గత 70 ఏళ్లలో పేరుకుపోయిన సమస్యల్ని నిర్మూలిస్తాం. భాజపా డీఎన్‌ఏలో ఈ గడ్డపై పుట్టిన అశుతోష్‌ ముఖర్జీ, డా.శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ వంటి మహనీయుల ఆలోచనలు, వారు నేర్పిన సంస్కృతి, విధి విధానాలు ఉన్నాయి’ అని మోదీ తెలిపారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని