Covid Deaths: శవాలపై రాజకీయం..కాంగ్రెస్‌ శైలి!

దేశంలో కరోనా మరణాల సంఖ్యపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ చేస్తోన్న ఆరోపణలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్డర్‌ హర్షవర్ధన్‌ తీవ్రంగా స్పందించారు. శవాలపై రాజకీయాలు చేయడం కాంగ్రెస్‌ పార్టీ విధానమని దుయ్యబట్టారు.

Published : 27 May 2021 00:18 IST

రాహుల్‌ గాంధీపై విరుచుకుపడిన ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌

దిల్లీ: దేశంలో కరోనా మరణాల సంఖ్యపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ చేస్తున్న ఆరోపణలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్డర్‌ హర్షవర్ధన్‌ తీవ్రంగా స్పందించారు. శవాలపై రాజకీయాలు చేయడం కాంగ్రెస్‌ పార్టీ విధానమని దుయ్యబట్టారు. కొందరికి దిల్లీ కంటే న్యూయార్క్‌పైనే ఎక్కువ నమ్మకమని విమర్శించిన ఆయన.. శవాలపై రాజకీయాలు చేసే రాబందుల మనస్తత్వాలు ఉన్నవారి గురించి మాట్లాడుతున్నానని అన్నారు. దేశంలో కరోనా మరణాలపై న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం గురించి రాహుల్‌ గాంధీ చేసిన ట్వీట్‌పై కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ ఘాటుగా స్పందించారు.

‘శవాలపై రాజకీయాలు చేయడం కాంగ్రెస్‌ శైలి. రాబందులు చెట్ల నుంచి కనుమరుగవుతున్నప్పటికీ, వాటి శక్తి భూమ్మీద ఉన్న రాబందులు గ్రహిస్తున్నట్లు కనిపిస్తోంది. దిల్లీ కంటే న్యూయార్క్‌పైనే రాహుల్‌ గాంధీకి నమ్మకం ఎక్కువ. శవాలపై రాజకీయాలు చేయడాన్ని భూమ్మీదున్న రాబందుల నుంచే ఎవరైనా నేర్చుకోవాలి’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్డర్‌ హర్షవర్ధన్‌ తీవ్ర విమర్శలు చేశారు.

భారత్‌లో అధికారిక లెక్కల కంటే కొవిడ్‌ మరణాల సంఖ్య వాస్తవంగా ఎక్కువగా ఉండవచ్చనే అంచనాలతో ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’ ఓ కథనాన్ని ప్రచురించింది. దీన్ని ట్విటర్‌లో పోస్టు చేసిన రాహుల్‌ గాంధీ.. ‘అంకెలు అబద్ధం చెప్పవు.. భారత ప్రభుత్వం ఆ పనిచేస్తుంది’ అంటూ స్పందించారు. దేశంలో కొవిడ్‌ మరణాలపై ఆయన గత కొన్నిరోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వాస్తవ లెక్కల కంటే ఎక్కువగానే కొవిడ్‌ మరణాలు ఉండవచ్చని వస్తున్న నివేదికలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని