Punjab elections 2022: కాంగ్రెస్‌ టికెట్‌ నిరాకరణ.. స్వతంత్రంగా పోటీకి దిగిన సీఎం సోదరుడు

కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ దక్కకపోవడంతో.. స్వతంత్రంగా పోటీ చేసేందుకు  సిద్ధపడ్డారు పంజాబ్‌ ముఖ్యమంత్రి సోదరుడు......

Published : 17 Jan 2022 01:33 IST

చండీగఢ్‌: ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయ రంగప్రవేశం చేయాలని భావించిన పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ చన్నీ సోదరుడు మనోహర్‌సింగ్‌కు భంగపాటు. ఆశించిన విధంగా ఆయనకు కాంగ్రెస్‌ టికెట్‌ దక్కలేదు. దీంతో మనోహర్‌ స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. బస్సి పతానా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.

ప్రభుత్వాసుపత్రిలో మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేసిన మనోహర్‌సింగ్‌.. తన ఉద్యోగాన్ని వదులుకొని రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధపడ్డారు. బస్సి పతానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున టికెట్‌ ఆశించారు. అయితే తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్‌.. బస్సి పతానా సిట్టింగ్‌ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్‌సింగ్‌ జీపీకే టికెట్‌ ఖరారుచేసింది. ‘ఒక కుటుంబం, ఒకే టికెట్‌’ నిబంధనలో భాగంగా మనోహర్‌కు టికెట్‌ దక్కనట్లు తెలుస్తోంది. కాగా సోదరుడు, సీఎం చరణ్‌జిత్ ఈసారి కూడా చామ్‌కౌర్‌ సాహెబ్‌ నుంచి బరిలో దిగుతున్నారు. అయితే టికెట్‌ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన మనోహర్‌సింగ్ స్వతంత్రంగానే ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్లు వెల్లడించారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస్‌ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 86మంది అభ్యర్థులతో తొలి జాబితాను శనివారం మధ్యాహ్నం  ప్రకటించింది. పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధూ అమృత్‌సర్‌ తూర్పు నుంచి పోటీ చేయనున్నారు. అలాగే, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ సినీనటుడు సోనూసూద్‌ సోదరి మాళవిక సూద్‌కు మోగ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. ఉపముఖ్యమంత్రి సుఖ్‌జిందర్‌ సింగ్‌ రాంధ్వా డేరాబాబా నానక్‌ స్థానం నుంచి, రవాణాశాఖ మంత్రి రాజా అమరిందర్‌ గిద్దర్బహా నుంచి బరిలో దిగుతున్నారు. 117 స్థానాలు కలిగిన పంజాబ్‌ అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని