
టీకాల కొరత.. ప్రధానికి మరో సీఎం లేఖ
దిల్లీ: కరోనాపై పోరులో టీకా కొరత ఏ మాత్రం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. టీకాలు నిండుకుంటున్నాయని పలు రాష్ట్రాలు అభ్యర్థనలు చేస్తున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే కేందాన్ని కోరగా.. తాజాగా రాజస్థాన్ కూడా ఈ జాబితాలోకి చేరింది. టీకాల కొరతపై ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లోత్ శుక్రవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో టీకాలు ఖాళీ అవుతున్నాయని, మరో 2 రోజులకే సరిపడా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు టీకాల పంపిణీ సజావుగా సాగాలంటే వెంటనే మరో 30 లక్షల డోసులను అత్యవసరంగా పంపించాలని కోరారు.
మరోవైపు వ్యాక్సిన్ల ఎగుమతిని తక్షణమే నిలిపివేసి, దేశంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ టీకా వేయాలని ప్రధానికి రాహుల్ గాంధీ రాసిన లేఖపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో టీకాల కొరత ఏర్పడిందో, ఆరోగ్య సంరక్షణపైనే నిబద్ధత కొరవడిందో ఆ పార్టీ నేతకు బాగా తెలుసని విమర్శించారు. ఆ మేరకు ఆ పార్టీ ప్రభుత్వాలకు రాహుల్ లేఖ రాయాలన్నారు. అలాగే ఇప్పటి వరకు ఆయన కరోనా టీకా ఎందుకు తీసుకోలేదో చెప్పాలని ప్రశ్నించారు.