Revanth Reddy: రాష్ట్రంలో భాజపా రెండుగా చీలిపోయింది: రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో భాజపా రెండుగా చీలి పోయిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...

Updated : 12 Oct 2022 15:36 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో భాజపా రెండుగా చీలి పోయిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్‌ అనుకూల వర్గం, వ్యతిరేక వర్గంగా భాజపా చీలిపోయిందన్నారు. కేసీఆర్‌ కుటుంబాన్ని జైలుకు పంపుతామని పదే పదే చెబుతున్న బండి సంజయ్‌.. కేసీఆర్‌ అవినీతి చిట్టాను నిన్న హో మంత్రి అమిత్‌షాకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నిర్మల్‌లో భాజపా సభతో చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గజ్వేల్‌లో కాంగ్రెస్‌ సభ విజయవంతమైందన్న రేవంత్‌ .. కార్యకర్తలు సత్తా చూపారని ప్రశంసించారు. గజ్వేల్‌కు ఎలా వస్తారో చూస్తామని కేటీఆర్‌ బృందం బెదిరించిందని, కేసీఆర్‌ ఊహించిన దానికంటే ఎక్కువ మంది గజ్వేల్‌ సభకు వచ్చారని తెలిపారు. కార్యకర్తలే రవాణా ఖర్చులు భరిస్తూ కాంగ్రెస్‌ సభలకు వస్తున్నారని, తెరాసపై వ్యతిరేకతకు జనాదరణే నిదర్శనమని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

‘‘గ్రీన్‌ చాలెంజ్‌ మాదిరి వైట్‌ ఛాలెంజ్‌ విసురుతున్నా. మంత్రి కేటీఆర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి వైట్‌ ఛాలెంజ్‌ విసురుతున్నా. ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు గన్‌ పార్క్‌ వద్దకు వస్తా. మీరు ఏ హాస్పిటల్‌కు రమ్మంటే అక్కడికి వస్తా. వైట్‌ ఛాలెంజ్‌లో భాగంగా ఉస్మానియా ఆసుపత్రికి వెళ్దాం. డ్రగ్స్‌ పరీక్షల కోసం వైద్యులకు నమూనాలు ఇద్దాం. యువతరాన్ని కాపాడే బాధ్యత మనపై ఉంది. డ్రగ్స్‌ కేసుపై మంత్రి కేటీఆర్‌ ఎందుకు స్పందించరు. ఒక మంత్రిగా మీరెందుకు జోక్యం చేసుకోకూడదు. డ్రగ్స్‌ కేసులో ఈడీకి అబ్కారీశాఖ వివరాలు ఎందుకు ఇవ్వలేదు’’ అని రేవంత్‌ ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని