Revanthreddy: ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కావాలని కేసీఆర్‌ భావిస్తున్నారు: రేవంత్‌

జగన్‌ జైలుకు వెళ్తే ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కావాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...

Updated : 24 Sep 2022 15:12 IST

హైదరాబాద్‌: జగన్‌ జైలుకు వెళ్తే ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కావాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘కేసీఆర్‌ జగన్‌ మొదటి నుంచి కవలలుగా కలిసి వెళ్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం కోసం జగన్‌, కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారు. షర్మిల పాదయాత్ర, పేర్ని నాని వ్యాఖ్యలు యాధృచ్ఛికం కావు. జల వివాదాలు పెంచి రెండు రాష్ట్రాలను కలిపే కుట్ర సాగుతోంది. పేర్ని నాని వ్యాఖ్యలను తెరాస ఎందుకు ఖండించడం లేదు’’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

‘‘పర్యావరణ అనుమతులు లేవని పాలమూరు-రంగారెడ్డిపై ఎన్జీటీ స్టే ఇచ్చింది. ప్రభుత్వ అలసత్వం వల్లే ఎన్జీటీలో ఓడిపోయాం. ఎన్జీటీ స్టే వల్ల దక్షిణ తెలంగాణకు తీవ్రమైన నష్టం. కేసీఆర్‌ కమీషన్ల కోసం రీడిజైన్‌ పేరుతో కాలయాపన చేశారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని జూరాల నుంచి శ్రీశైలంకు మార్చారు. పాలమూరు - రంగారెడ్డిని కేసీఆర్‌ మూడేళ్లలో పూర్తి చేస్తానన్నారు. ఆరేళ్లు గడిచినా పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఎన్జీటీ స్టే వల్ల దక్షిణ తెలంగాణకు మరణశాసనం లిఖించినట్టే. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టులు శాశ్వత సమాధి కానున్నాయి. పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్‌ నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం. ప్రాజెక్టులపై జగన్‌ను కేసీఆర్‌ ఎందుకు ఒప్పించలేదు’’ అని రేవంత్‌రెడ్డి నిలదీశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని