‘ఆత్మపరిశీలన’లో మహారాష్ట్ర ప్రభుత్వం..?

హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలతో ‘మహా వికాస్‌ అగాఢీ’ కూటమి మరోసారి ఇరుకున పడినట్లు తెలుస్తోంది.

Published : 21 Mar 2021 15:34 IST

‘మహా వికాస్‌ అగాఢీ’లో ముసలం నేపథ్యంలో..

ముంబయి: మహారాష్ట్ర పోలీసు అధికారి సచిన్‌ వాజే అరెస్టు అనంతరం అక్కడి రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. ముఖ్యంగా హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలతో ‘మహా వికాస్‌ అగాఢీ’ కూటమి మరోసారి ఇరుకున పడినట్లు తెలుస్తోంది. తాజా ఘటనలు ప్రభుత్వానికి కళంకం తెచ్చాయని అంగీకరిస్తోన్న నేతలు, కూటమి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే నష్ట నివారణ చర్యలు చేపట్టిన ఎన్‌సీపీ అధినేత  పార్టీ సీనియర్‌ నేతలతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ముంబయి పోలీస్‌ మాజీ చీఫ్‌ పరమ్‌బీర్‌ చేసిన ఆరోపణలు, సచిన్‌ వాజే కేసు వల్ల ‘మహా వికాస్‌ అగాఢీ’ ప్రభుత్వ ప్రతిష్టకు కళంకం తెచ్చాయని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అంగీకరించారు. ‘ప్రతి నెల రూ.వంద కోట్లు వసూలు చేయాలంటూ హోంమంత్రిపై ఓ పోలీసు ఉన్నతాధికారే ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రికి ఆయన రాసిన లేఖలో సంచలన విషయాలు ఉన్నాయి. ప్రభుత్వంపై, మంత్రులపై ఇలాంటి ఆరోపణలు రావడం దారుణం, దురదృష్టకరం’ అని సంజయ్‌ రౌత్‌ అభిప్రాయపడ్డారు. మంచి పేరున్న ఓ అధికారి ఇటువంటి లేఖ రాయడంపై చర్చించాల్సిన విషయమేనని, ఈ సందర్భంగా మిత్రపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఏర్పడ్డ తాజా పరిణామాలపై విలేకరులతో మాట్లాడిన ఆయన, మహా వికాస్‌ అగాఢీ ప్రభుత్వంపై పడిన మరకలను ఎలా తొలగించుకోవాలో మిత్రపక్షాలు చర్చించుకోవాలన్నారు.

సవాళ్ల నడుమ మహా వికాస్‌..!

మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్‌తో పాటు మరికొన్ని పార్టీలు కలిసి ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌ సారథ్యంలో ‘మహా వికాస్‌ అగాఢీ’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. శివసేన నేత ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్‌సీపీకి చెందిన అనిల్‌ దేశ్‌ముఖ్‌ హోంమంత్రిగా బాధ్యతల్లో ఉన్నారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ ఆదినుంచి ఏదో ఒక అంశంలో కూటమి పలు విమర్శలు, సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. మొన్నటివరకు ఓ యువతి ఆత్మహత్య కేసులో సంబంధం ఉందంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శివసేన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఎన్‌సీపీకి చెందిన నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలు కూటమికి మరోసారి తలనొప్పిగా మారాయి. హోంమంత్రిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామా చేయాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా భాజపా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది.

శరద్‌ పవార్‌ కీలక నిర్ణయం..?

ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామాలపై చర్చించేందుకు సిద్ధమైన ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్, కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పార్టీకి చెందిన మంత్రులను దిల్లీకి రావాలని ఆదేశించారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌‌, ఎన్‌సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి జయంత్ పాటిల్‌లు శరద్‌ పవార్‌ను కలువనున్నారు. వీరితో పాటు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కూడా శరద్‌ పవార్‌ను కలిసి మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ  పరిణామాలపై చర్చించనున్నారు. ఆదివారం సాయంత్రం జరిగే శరద్‌ పవార్‌తో జరిగే భేటీ అనంతరం కీలక నిర్ణయం వెలుబడే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని