రుణం తీసుకోవడం తప్ప వేరే దారిలేదు: పవార్‌

మహారాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మునుపెన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదని ఆయన పేర్కొన్నారు.

Published : 19 Oct 2020 22:20 IST

ముంబయి: మునుపెన్నడూ లేని విధంగా మహారాష్ట్ర ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల సందర్శనలో భాగంగా ఆయన ఉస్మానాబాద్‌లోని తుల్జాపూర్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు. 

‘చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు సహాయం చేయడానికి ప్రభుత్వం రుణాలు తీసుకోవడం తప్ప వేరే దారిలేదు. ఈ విషయంపై త్వరలోనే నేను సీఎంతో చర్చిస్తా. ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒంటరిగా ఏం చేయలేదు. ఈ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం ముఖ్యం. ప్రధాని మోదీ సైతం వరద ప్రభావిత ప్రాంతాలకు సహాయం చేసేందుకు సహకరిస్తామని సీఎం ఠాక్రేకు హామీ ఇచ్చినట్లు నాకు తెలిసింది’ అని పవార్‌ తెలిపారు. రాష్ట్రంలో ఉస్మానాబాద్‌, లాతూర్‌, షోలాపూర్‌, నాందేడ్‌, పందార్‌పూర్‌ ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉందని.. ఈ ధాటికి సోయాబీన్‌, పత్తి, చెరకు వంటి పంటలు ఎక్కువ దెబ్బతిన్నాయన్నారు. గతవారం మహారాష్ట్రలోని పుణె, ఔరంగాబాద్‌, కొంకన్‌ డివిజన్లలో భారీ వర్షాల ధాటికి 48 మంది ప్రాణాలు కోల్పోగా... లక్షలాది హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు 40వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని