
Politcs: 5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 చోట్ల విజయం భాజపాదేనా?
ఇంటర్నెట్‌డెస్క్: వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో 4 చోట్ల భాజపా విజయం సాధించనుందని ఏబీపీ- సీఓటర్-ఐఏఎన్‌ఎస్ స్నాప్ పోల్ సర్వే అంచనావేసింది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో భాజపా అధికారం నిలబెట్టుకుంటుందని తెలిపింది. అయితే యూపీ, ఉత్తరాఖండ్‌లో గతం కంటే తక్కువ స్థానాలు గెలవనున్నట్లు సర్వే పేర్కొంది. పంజాబ్‌లో ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు తెలిపింది. పంజాబ్ తప్ప మిగతా 4 రాష్ట్రాల్లో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తమైనట్లు సర్వే వెల్లడించింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో 217 స్థానాలు:
ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతాపార్టీ మరోసారి జయకేతనం ఎగరేస్తుందని ఏబీపీ సర్వే వెల్లడించింది. 403 శాసనసభ స్థానాలున్న యూపీలో కమళదళం మిత్రులతో కలిసి 217 సీట్లు కైవసం చేసుకుంటుందని తెలిపింది. 2017లో 325 సీట్లు సాధించిన భాజపా.. ఈసారి 108 స్థానాలు కోల్పోనుందని పేర్కొంది. ఈ స్థానాలను సమాజ్‌వాదీ పార్టీ దక్కించుకోనుందని సర్వే వెల్లడించింది. యూపీలో భాజపా-ఎస్పీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని, సమాజ్‌వాదీ పార్టీ 156 సీట్లు దక్కించుకునే అవకాశముందని సర్వే తెలిపింది. అయితే భాజపా ఓట్ల శాతంలో పెద్ద తేడా ఉండబోదని, 40.7శాతం ఓట్లు సాధిస్తుందని పేర్కొంది. ఇది గత ఎన్నికల కంటే 0.7శాతం తక్కువ. ఎస్పీ 7.1శాతం అధికంగా, 31.1 శాతం ఓట్లు సాధిస్తుందని సర్వే తేల్చింది.
ఉత్తరాఖండ్‌లో పుంజుకోనున్న కాంగ్రెస్
యూపీతోపాటు ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లోనూ సర్వే నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పుంజుకుంటుందని సర్వేలో తేలింది. పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ అతిపెద్ద పార్టీగా అవతరించనుందని సర్వే అంచనా వేసింది. 70 శాసనసభ స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో 38 సీట్లతో భాజపా మెజార్టీ మార్కును దాటుతుందని సర్వే పేర్కొంది. గతంలో ఆ పార్టీ సాధించిన 57 సీట్లతో పోలిస్తే 19 స్థానాలు తక్కువని అంచనా వేసింది. హస్తం పార్టీ 21 సీట్లు ఎక్కువ సాధించి, తన బలాన్ని 32కి పెంచుకుంటుందని సర్వే పేర్కొంది. 117 స్థానాలున్న పంజాబ్ శాసనసభలో 51 సీట్లతో ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించనుందని తెలిపింది. అధికార కాంగ్రెస్ 46 సీట్లకు పరిమితం కానున్నట్లు అంచనా వేసింది. గత ఎన్నికల్లో 77 సీట్లు సాధించిన హస్తం పార్టీ.. ఈసారి 31 నియోజకవర్గాలు కోల్పోనుందని తెలిపింది. అయితే కొత్త సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ పాలన కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశముంది. 20 సీట్లతో అకాళీదళ్ మూడో స్థానంలో నిలవనుందని సర్వే పేర్కొంది.
గోవాలో 21 సీట్లు!
40 శాసనసభ స్థానాలున్న గోవాలో అధికార భాజపా 21 స్థానాలతో తిరిగి అధికారం నిలబెట్టుకునే అవకాశముందని సర్వే అంచనా వేసింది. ఆప్ 5, కాంగ్రెస్ 4 స్థానాలు సాధిస్తాయని లెక్కకట్టింది. ఇతరులు 10 చోట్లు గెలుపొందుతారని పేర్కొంది. మణిపూర్‌లోనూ కమలం పార్టీదే ఆధిక్యమని సర్వే తేల్చింది. 60 శాసనసభ స్థానాల్లో భాజపా 27, కాంగ్రెస్ 22 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేసింది.
మోదీ పని తీరు సంతృప్తికరం
ప్రధాని మోదీ పనితీరుపై ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించగా.. 41.4 శాతం మంది చాలా సంతృప్తికరంగా ఉన్నట్లు తేలింది. 26.9శాతం మంది కొంత వరకు సంతృప్తికరమని, 29.1 శాతం మంది అసలు సంతృప్తిగా లేమన్నారని సర్వే తేల్చింది. 2.6శాతం మంది ఏమీ చెప్పలేమని బదులిచ్చారు. కేంద్రం పని తీరుపై 36.3శాతం మంది ఎక్కువ సంతృప్తి వ్యక్తం చేయగా.. 28.4శాతం మంది కొంతవరకు సంతృప్తి చెందినట్లు తెలిపారు. 31.8శాతం మంది అసలు సంతృప్తికరంగా లేమన్నారు. 3.5 శాతం మంది ఏమీ చెప్పలేమన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ పని తీరుపై పంజాబ్‌లో ఎక్కువగా వ్యతిరేకత కనిపించినట్లు సర్వే తెలిపింది.