Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌ను అఫ్గానిస్థాన్‌ కంటే ఘోరంగా మార్చారు: నారా లోకేశ్

ఏపీ సీఎం జగన్ తన అరాచక పాలనతో ఆంధ్రప్రదేశ్‌ను అఫ్గానిస్థాన్ కంటే ఘోరంగా మార్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఆడబిడ్డలను

Published : 09 Sep 2021 01:29 IST

అమరావతి: ఏపీ సీఎం జగన్ తన అరాచక పాలనతో ఆంధ్రప్రదేశ్‌ను అఫ్గానిస్థాన్ కంటే ఘోరంగా మార్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఆడబిడ్డలను హత్య చేసిన నేరస్థులు 21రోజుల్లో బయటకొచ్చేయటమే దిశ చట్టం అమలా?అని నిలదీశారు. ‘‘హంతకుల్ని 21 రోజుల్లో శిక్షిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. నేరస్థులు బయట తిరుగుతూ బాధితుల తల్లిదండ్రులను చంపుతామని బెదిరిస్తుంటే పట్టించుకునేవారు లేరు. 36 కేసుల్లో జైలుకెళ్లి బెయిల్‌పై బయట తిరుగుతున్న జగన్ తనలాంటి నేరస్థులు, ఆడబిడ్డల్ని చంపిన హంతకులు కూడా బయట ఉండాలనే ఆలోచనతో ఉన్నారా? కడప జిల్లా బద్వేలు మండలం చింతల చెరువులో శిరీషని చంపిన ఉన్మాదులు బెయిల్‌పై బయట తిరుగుతూ బాధితురాలి తల్లిదండ్రుల్ని చంపుతామని బెదిరిస్తున్నారు. దీనిపై వారు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.

ప్రొద్దుటూరులో లావణ్యపై దాడి చేసిన నిందితుడూ బయట తిరుగుతూ మరో దాడి చేస్తానని హెచ్చరిస్తున్నాడు. పోలీసులు మాత్రం నేరగాళ్లకు మద్దతు తెలుపుతూ.. అందరికీ న్యాయం చేశామని చెప్తున్నారు. లావణ్య చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానన్న ప్రభుత్వం ఇంతవరకూ రూపాయి సాయం కూడా చేయలేదు. విశాఖలో వాలంటీర్ ప్రియాంకపై దాడిచేసిన నిందితుడు నెల రోజులు తిరగకుండానే బెయిల్‌పై బయట తిరుగుతున్నాడు. ఆడ పిల్లలను ఆదుకోవటమంటే సొంత మీడియాకు కోట్ల రూపాయల ప్రకటనలివ్వటం కాదు. దిశ చట్టం తెచ్చాక నేను పేర్కొన్న బాధిత మహిళల కుటుంబాలకు ఏం న్యాయం చేశారు? ఎస్సీ విద్యార్థిని రమ్యను చంపిన మృగాడికి ఏం శిక్ష విధించారో మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. బాధిత కుటుంబాల పక్షాన తెదేపా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’’ అని లోకేశ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని