Ts News: రాష్ట్ర ప్రభుత్వమే నడిపించాలనుకుంటే జీహెచ్ఎంసీ ఎన్నికలెందుకు?: బండి సంజయ్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు జరిగి ఏడాదైనా ఇంతవరకు జనరల్ బాడీ మీటింగ్ పెట్టని వైఖరికి నిరసనగా ధర్నా చేసిన భాజపా కార్పొరేటర్లను

Updated : 24 Nov 2021 11:15 IST

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు జరిగి ఏడాదైనా ఇంతవరకు జనరల్ బాడీ మీటింగ్ పెట్టని వైఖరికి నిరసనగా ధర్నా చేసిన భాజపా కార్పొరేటర్లను అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన కార్పొరేటర్లను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాప్రతినిధులన్న కనీస స్ఫృహ లేకుండా భాజపా కార్పొరేటర్ల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బండి సంజయ్‌  ప్రకటన విడుదల చేశారు. తెరాస పాలనలో ప్రజాప్రతినిధుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల సంగతేంటని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పాలకవర్గం ఏర్పడి దాదాపు ఏడాదైనా స్టాండింగ్ కమిటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయలేదన్నారు. ఏకపక్షంగా అనుకూల సభ్యులతో స్టాండింగ్ కమిటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడం తెరాస నియంతృత్వానికి నిదర్శనమని దుయ్యబట్టారు. కరోనా సాకు చూపి నామమాత్రంగా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ పాలనను పూర్తిగా గాలికొదిలేశారని ఆక్షేపించారు. 74వ రాజ్యాంగ సవరణను తెరాస ప్రభుత్వం తుంగలో తొక్కిందని.. కార్పొరేటర్లకు జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ అందుబాటులో ఉండటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నడిపించాలనుకుంటే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాజకీయాల పేరుతో అభివృద్ధిని అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా తెరాస ప్రభుత్వం రాజకీయాలను ఎన్నికల వరకే పరిమితం చేయాలని బండి సంజయ్‌ హితవు పలికారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని